
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలా అనే అంశంపై క్రికెట్ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రధానంగా చర్చలో ఉన్న విషయం ఏమిటంటే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలా అన్నది వారు చర్చిస్తున్నారు. అయితే వరుణ్ చక్రవర్తి టీ20 ప్రపంచకప్ లో విఫలం కావడంతో ఫైనల్‌లో చాన్స్ తీసుకోకూడదని, అతని కన్నా కుల్దీప్‌కు మెరుగైన గణాంకాలు ఉన్నాయని, కనుక వరుణ్‌కు బదులుగా ఫైనల్‌లో కుల్దీప్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరి రికార్డు ఎలా ఉంది..?
వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు 44 టీ20ఐ మ్యాచ్‌లు ఆడగా 42 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. 72 వికెట్లు పడగొట్టాడు. సగటు 16.30, ఎకానమీ 7.45గా ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ 54 మ్యాచ్‌లు ఆడి 52 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. 95 వికెట్లు తీశాడు. సగటు 13.74గా ఉంది. ఎకానమీ 6.95గా ఉంది. మొత్తం గణాంకాల ప్రకారం చూస్తే కుల్దీప్ యాదవ్ సగటు, ఎకానమీ పరంగా వరుణ్ కంటే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి న్యూజలాండ్‌తో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడగా 16 ఓవర్లు బౌలింగ్ వేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. సగటు 32.75గా, ఎకానమీ 4.66గా ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తో 8 మ్యాచ్‌లు ఆడి 25 ఓవర్లు బౌలింగ్ వేసి 9 వికెట్లు తీశాడు. 21.22 సగటు, 7.64 ఎకానమీని నమోదు చేశాడు. న్యూజిలాండ్‌పై కుల్దీప్ ఎక్కువ వికెట్లు తీసుకున్నప్పటికీ వరుణ్ ఎకానమీ రేటు మాత్రం మెరుగ్గా ఉంది.
అహ్మదాబాద్ పిచ్‌పై..
ఫైనల్ జరగనున్న నరేంద్ర మోదీ స్టేడియంలో ఇద్దరి ప్రదర్శనలు ఇలా ఉన్నాయి. ఈ మైదానంలో కుల్దీప్ యాదవ్ 1 మ్యాచ్ ఆడి 1 ఓవర్ వేసి 12 పరుగులు ఇచ్చాడు. వికెట్లు తీయలేదు. వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్‌లు ఆడి 11 ఓవర్లు వేసి 8 వికెట్లు తీశాడు. 14.25 సగటు, 10.36 ఎకానమీ ఉంది. ఈ మైదానంలో వరుణ్ వికెట్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఎకానమీ కొంత ఎక్కువగా ఉంది.
ఎవరు బెటర్..?
మొత్తం గణాంకాలను పరిశీలిస్తే కుల్దీప్ యాదవ్ స్థిరమైన ప్రదర్శనతో మెరుగైన టీ20 రికార్డు కలిగి ఉన్నాడు. ఇదే కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అతన్ని జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం నిపుణులలో పెరుగుతోంది. ఇక వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతని బౌలింగ్ బాగాలేదు. మరోవైపు కుల్దీప్ యాదవ్ బంతిని రెండు దిశల్లో తిప్పగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఎడమచేతి, కుడిచేతి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అందువల్ల అహ్మదాబాద్ పిచ్‌పై అతను భారత్‌కు అదనపు వికెట్ తీసే అవకాశాన్ని అందించగలడని నిపుణులు భావిస్తున్నారు. మరి టీమిండియా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.












