
రామ్‌చరణ్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని హుక్ స్టెప్ ముఖ్యంగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బయటపెట్టారు.
ఒక డాన్స్ షోలో మాట్లాడిన జానీ మాస్టర్ చికిరి చికిరి పాటలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యాట్ స్టెప్ పూర్తిగా రామ్‌చరణ్ ఆలోచన నుంచే వచ్చిందని వెల్లడించారు. బ్యాట్‌ను పట్టుకునే తీరు, దానితో చేసే ప్రత్యేకమైన కదలికలు అన్నీ చరణ్ స్వయంగా సూచించారని చెప్పారు.
ఈ స్టెప్‌ను చరణ్ కేవలం సూచించడమే కాకుండా, తానే ముందుగా ప్రాక్టీస్ చేసి జానీ మాస్టర్‌కు చేసి చూపించారని తెలిపారు. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే చరణ్ ఈ స్టెప్‌ను ప్రెజెంట్ చేశారని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భాన్ని తలుచుకుంటూ జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. స్టెప్ ఆలోచన పూర్తిగా చరణ్ నుంచే వచ్చినప్పటికీ, ఆయన ఎప్పుడూ కొరియోగ్రాఫర్లకే పూర్తి క్రెడిట్ ఇస్తారని, అది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని చెప్పారు.
చికిరి చికిరి పాట రామ్‌చరణ్ నటిస్తున్న రాబోయే చిత్రం పెద్ది లోనిది కాగా ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. భారీ అంచనాల మధ్య పెద్ది చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.








