
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 8న జరిగింది. భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తమ టైటిల్ డిఫెండింగ్ యాత్రను అమెరికాపై 29 పరుగుల విజయంతో ప్రారంభించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో జట్టును 161/9 స్కోరుకు చేర్చాడు. అనంతరం మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం అమెరికాను 132/8కు పరిమితం చేసింది.
టీమిండియా బ్యాటర్ల బ్యాట్లపై రబ్బరు పొర..?
గత కొన్ని సంవత్సరాలుగా టీ20ల్లో భారత బ్యాటర్లు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు శక్తివంతమైన షాట్లు, సమయోచిత స్ట్రోక్ ప్లేతో ఆధిపత్యం చాటుతున్నారు. ఈ నేపథ్యంలో హరి టీవీ జర్నలిస్ట్ లహిరు ముదలిగేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజపక్స భారత ఆటగాళ్ల బ్యాట్ల శక్తిపై సందేహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు లభిస్తున్న బ్యాట్లు మా వద్ద దొరికే ఉత్తమ బ్యాట్లకంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వాటిపై రబ్బరు పొర వేసినట్లుగా అనిపిస్తోంది.. అని వ్యాఖ్యానించినట్లు న్యూస్ వైర్ పేర్కొంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఊహించలేను. ఈ బ్యాట్లు ఇతరులకు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు. ఇది అర్థరహితంగా అనిపించినా నాకు అలా అనిపించింది.. అని ఆయన అన్నారు.
నా ఉద్దేశం ప్రశంసించడమే: రాజపక్స
అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్లు పూర్తిగా కలపతో తయారై ఉండాలి. పరిమాణం, పదార్థాల విషయంలో కఠిన నియమాలు అమల్లో ఉన్నాయి. ఏ విధమైన శక్తి పెంపు పదార్థాలు వాడటానికి అనుమతి లేదు. ఇక భానుక రాజపక్స చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజపక్సపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవలి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వేరేలా అర్థం చేసుకున్నారని తెలిసింది. కొన్ని భాగాలు అనువాదంలో తారుమారయ్యాయి.. అని రాజపక్స తెలిపారు. నా ఉద్దేశ్యం ప్రశంసించడమే. భారత క్రికెట్ వ్యవస్థ, మౌలిక వసతులు, పరికరాల ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. వారి బ్యాట్ తయారీదారులు ప్రపంచంలోనే నిపుణులు.. అని పేర్కొన్నారు. తరువాత ఆలోచిస్తే మరింత స్పష్టతతో చెప్పాల్సిందని అనిపించింది. ఎలాంటి అవమాన ఉద్దేశం లేదు. ఎల్లప్పుడూ వారంటే గౌరవమే.. అని ఆయన స్పష్టం చేశారు.
కాగా ప్రతి బ్యాటర్ తనకు అనుకూలంగా ప్రత్యేకంగా తయారుచేసిన ప్లేయర్ ఎడిషన్ బ్యాట్ ఉపయోగిస్తాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమ గ్రిప్, బరువు, స్వింగ్ శైలికి అనుగుణంగా బ్యాట్లు రూపొందించించుకుంటారు. ఇవన్నీ ఐసీసీ నిబంధనల పరిధిలోనే ఉంటాయి. అయితే ఈ ఘటనతో రాజపక్స వ్యాఖ్యలు ప్రశంసగా ఉన్నాయా లేక ఆరోపణలా అనిపించాయా అన్న చర్చ కొనసాగుతోంది.







