
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరిపాలనా సేవల్లో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 24 వరకు సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, వయస్సు పరిమితి, ప్రయత్నాల సంఖ్య, ఫీజు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచన ఇచ్చింది. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ (www.upsc.gov.in) ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని స్పష్టం చేసింది.
ఖాళీల వివరాలు
ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా 933 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థుల కోసం 33 ఖాళీలు కేటాయించారు. వాటిలో చూపు లోపం లేదా తక్కువ చూపు ఉన్నవారికి 7, వినికిడి లోపం ఉన్నవారికి 11, కదలిక లోపం, సెరెబ్రల్ పాల్సీ, కుష్టు వ్యాధి నుంచి కోలుకున్న వారు, డ్వార్ఫిజం, యాసిడ్ దాడి బాధితులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉన్నవారికి 8, బహుళ వైకల్యాలు ఉన్నవారికి 7 పోస్టులు కేటాయించారు. తుది ఖాళీల సంఖ్య క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీల నుంచి కచ్చితమైన సమాచారం అందిన తర్వాత మారే అవకాశం ఉందని యూపీఎస్సీ తెలిపింది.
అర్హతలు
భారతదేశంలోని కేంద్ర లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటైన విశ్వవిద్యాలయం నుంచి లేదా పార్లమెంట్ చట్టం ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన డీమ్‌డ్ విశ్వవిద్యాలయ డిగ్రీ కూడా అంగీకరిస్తారు. సమాన అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు పరంగా అభ్యర్థి ఆగస్టు 1 నాటికి కనీసం 21 ఏళ్లు పూర్తై ఉండాలి. గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు. రిజర్వ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కమిషన్ సూచించింది.
ప్రయత్నాల సంఖ్య
- సాధారణ వర్గానికి 6 ప్రయత్నాలు మాత్రమే అనుమతిస్తారు.
- ఇతర వెనుకబడిన వర్గాలకు 9 ప్రయత్నాలు.
- వైకల్యం ఉన్న అభ్యర్థులకు 9 ప్రయత్నాలు.
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రయత్నాలపై ఎలాంటి పరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులు తప్ప మిగిలిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణులై ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు మరో రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికీ మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వైకల్యం ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం
ప్రాథమిక పరీక్షలో 2 ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి. మొత్తం 400 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం స్క్రీనింగ్ కోసం మాత్రమే. ఈ పరీక్షలో సాధించిన మార్కులను తుది మెరిట్‌కు పరిగణనలోకి తీసుకోరు. ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరవుతారు. ప్రధాన పరీక్షలో మొత్తం 9 వివరణాత్మక పేపర్లు ఉంటాయి. వీటిలో వ్యాసం, జనరల్ స్టడీస్ 4 పేపర్లు, ఐచ్ఛిక విషయానికి 2 పేపర్లు, 2 భాషా పేపర్లు ఉంటాయి. ప్రధాన పరీక్ష మొత్తం మార్కులు 1750. అనంతరం వ్యక్తిత్వ పరీక్ష నిర్వహిస్తారు.
ఐచ్ఛిక విషయాలు
వ్యవసాయం, పశువైద్యం, మానవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, సివిల్ ఇంజినీరింగ్, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, భూగోళ శాస్త్రం, భూవిజ్ఞానం, చరిత్ర, న్యాయం, నిర్వహణ, గణితం, మెకానికల్ ఇంజినీరింగ్, వైద్య శాస్త్రం, తత్వశాస్త్రం, భౌతిక శాస్త్రం, రాజకీయం, అంతర్జాతీయ సంబంధాలు, మనోవిజ్ఞానం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సమాజ శాస్త్రం, గణాంక శాస్త్రం, జంతు శాస్త్రం, అలాగే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లం తదితర భాషల సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు.
గమనిక: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆశావహులు ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సమయానికి దరఖాస్తు చేసుకొని అధికారిక వెబ్‌సైట్‌లోని పూర్తి వివరాలను పరిశీలించాలని యూపీఎస్సీ సూచించింది.







