
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్ లేకుండానే రైల్లో ఎక్కే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) కనిపించగానే చాలామందికి భయం మొదలవుతుంది. ఎంత ఫైన్ వేస్తారు?, రైలు నుంచి దింపేస్తారా?, దురుసుగా ప్రవర్తిస్తారా? వంటి ఆందోళనలు కలుగుతాయి. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. టీటీఈ తనకు నచ్చినట్లు ప్రవర్తించడానికి అవకాశం లేదు. మీరు మీ హక్కులు తెలుసుకుంటే, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా వ్యవహరించవచ్చు.
టికెట్ లేకపోతే టీటీఈ ఏమి చేయవచ్చు? ఏమి చేయలేడు?
టికెట్ లేకపోయినా, లేదా తప్పు టికెట్ ఉన్నా, టీటీఈ మిమ్మల్ని నేరస్థుడిలా చూడకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం, నిర్ణీత ఛార్జీతో పాటు పెనాల్టీ వసూలు చేసి సరైన టికెట్ జారీ చేయాలి. అందుకు సంబంధించిన రసీదు ఇవ్వడం తప్పనిసరి. ఇష్టారాజ్యంగా డబ్బులు అడగడం, రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిషేధం. అలాగే ప్రయాణికులతో దురుసుగా మాట్లాడడం, బెదిరించడం, అవమానించడం టీటీఈకి అనుమతి లేదు. నిబంధనలను వివరించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడమే అతని బాధ్యత.
రైలు నుంచి దింపేయగలరా?
వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ బోగీలో కూర్చుంటే, సీట్లు లేని పక్షంలో జనరల్ బోగీకి వెళ్లమని సూచించవచ్చు. కానీ నిబంధనల ప్రకారం అవసరం లేకుండా రైలు నుంచి వెంటనే దింపేయడం సాధ్యం కాదు. మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో టీటీఈ మరింత సంయమనంతో, మానవీయంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
టీటీఈ దుర్వినియోగం చేస్తే ఏం చేయాలి?
పెనాల్టీ విధించే ముందు, ఏ నిబంధన ప్రకారం ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో టీటీఈ స్పష్టంగా చెప్పాలి. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అతనికి లేదు. అన్యాయం జరుగుతోందని అనిపిస్తే, అదనంగా డబ్బులు అడిగితే, లేదా బెదిరిస్తే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సులభమైన ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫిర్యాదు ఎక్కడ చేయాలి?
- ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కు ఫోన్ చేయవచ్చు లేదా మెసేజ్ పంపవచ్చు. అలాగే రైల్ మదద్ (Rail Madad) యాప్ ద్వారా కూడా టీటీఈపై ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
- ఫిర్యాదులో రైలు నంబర్, కోచ్ నంబర్, జరిగిన సంఘటన వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. టీటీఈ ఎలాంటి పరిస్థితుల్లోనూ లంచం తీసుకోవడం లేదా ప్రయాణికులను బెదిరించడం చట్టవిరుద్ధం.
- మీ హక్కులు తెలుసుకోవడం వల్లే మీరు భయపడకుండా, సురక్షితంగా, ప్రశాంతంగా ప్రయాణం చేయగలుగుతారు.
ముఖ్య గమనిక: రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం, అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నియమాలను పాటించాలి.








