Viral News : వర్షాకాలంలో సహజంగానే క్రిమి కీటకాలు, పురుగులు, పాములు వంటివి బయటకు వస్తుంటాయి. వాతావరణం చల్లబడుతుంది కనుక అవి పుట్టల్లో, భూమిలో దాక్కుని ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో బయటకు వస్తుంటాయి. అయితే పాములు కుడితే వెంటనే బాధితులను హాస్పిటల్‌కు తరలిస్తారు. అక్కడ బాధితులకు వైద్యులు చికిత్సను అందించి ప్రాణాలను కాపాడుతారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ప్రవర్తించాడు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ సిటీకి సమీపంలో ఉన్న మఖి పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్‌లో రామేంద్ర యాదవ్ అనే వ్యక్తి భార్యను పాము కాటు వేసింది. దీంతో ఆ వ్యక్తి వెంటనే భార్యను హాస్పిటల్‌కు తరలించాడు. అయితే చిత్రం ఏమిటంటే.. ఆమెతోపాటు ఆ పామును కూడా అతను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. దీంతో అందరూ అతన్ని వింతగా చూశారు.

ఇక హాస్పిటల్‌లో అతని భార్యకు వైద్యులు చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు. అయితే పామును ఎందుకు తెచ్చావని అడగ్గా.. అందుకు అతను బదులిస్తూ.. ఏ పాము కాటు వేసిందో తెలిస్తే ఇంకా సులభంగా చికిత్సను అందించవచ్చు కదా.. అందుకనే పామును కూడా తెచ్చా.. అంటూ సమాధానం చెప్పాడు. దీంతో అవాక్కవ్వడం వైద్యుల వంతైంది. ఇక ఆ పామును అతను ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో బంధించి తేగా.. దానికి రంధ్రాలు కూడా చేశాడు. పాము శ్వాస పీల్చుకునేందుకు అని అతను ఆ బాటిల్‌కు రంధ్రాలు పెట్టాడు. తన భార్య డిశ్చార్జి కాగానే ఆ పామును అడవిలో విడిచి పెడతానని అతను స్పష్టం చేశాడు. ఇక ఆ వ్యక్తి చేసిన పనిని చూసి చుట్టు పక్కల ఉన్నవారు కూడా విస్తుపోయారు.