Cobra Movie Review : విక్ర‌మ్ న‌టించిన కోబ్రా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

August 31, 2022 11:40 AM

Cobra Movie Review : వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను చేయ‌డంలో చియాన్ విక్ర‌మ్‌కు మంచి పేరుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న చేసిన సినిమాలు అన్నీ వేటికవే చాలా ప్ర‌త్యేకమైన‌వి. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో చేసిన అప‌రిచితుడు ఆయ‌న‌కు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ ఆయ‌న అలాంటి సినిమాలు చేయ‌లేదు. కానీ ఆయ‌న న‌టించిన చిత్రాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. ఇక తాజాగా ఆయ‌న మ‌రోమారు కోబ్రా అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా.. లేదా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

క‌థ‌..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుమోసిన వ్య‌క్తుల‌ను కోబ్రా అనే అంత‌ర్జాతీయ కిల్ల‌ర్ వ‌రుస‌గా చంపుతుంటాడు. ఇత‌న్ని ప‌ట్టుకునేందుకు ఇంట‌ర్ పోల్ స‌హా ప‌లు దేశాల‌కు చెందిన పోలీసులు బాగా గాలిస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆచూకీ కూడా ల‌భించ‌దు. అయితే చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? కోబ్రాను ప‌ట్టుకుంటారా ? అత‌ను ఎందుకు అలా హ‌త్య‌లు చేస్తుంటాడు ? దాని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Vikram Cobra Movie Review know how is the movie
Cobra Movie Review

విశ్లేష‌ణ‌..

విక్ర‌మ్ న‌ట‌న‌కు పేరుపెట్టాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లో అయినా అల‌వోక‌గా న‌టించ‌గ‌ల‌డు. కోబ్రా మూవీలోనూ అలాగే చేశాడు. ప‌లు భిన్న గెట‌ప్‌ల‌లో త‌న‌దైన శైలిలో న‌టించారు. ఇక ఇందులో ముగ్గురు ఫీమేల్ లీడ్స్ న‌టించారు. వారిలో ఒక‌రు పోలీస్ ఆఫీస‌ర్ గా విక్ర‌మ్‌ను ఛేజ్ చేస్తుంటారు. ఇంకో ఇద్ద‌రు విక్ర‌మ్‌కు జోడీగా న‌టించారు. ఈ మూవీలో శ్రీ‌నిధి శెట్టి, మృణాళిని ర‌వి విక్ర‌మ్ కు జోడీలుగా చేశారు. ఇక మీనాక్షి గోవింద రాజ‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించింది. ఈమె కోబ్రాను వెంబ‌డిస్తుంటుంది.

ఇక ఈ మూవీలో మాజీ ఫాస్ట్ బౌల‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా యాక్ట్ చేశాడు. ఆయ‌న ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాడు. ఇక మిగిలిన పాత్ర‌ధారులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే యాక్ట్ చేశారు. కాగా ఈ మూవీ ద‌ర్శ‌కుడికి ఇది 3వ సినిమా. అంత‌కు ముందు ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు డిమాంటి కాల‌నీ, అంజ‌లి సిబిఐ వంటి చిత్రాల‌ను చేశారు. అయిన‌ప్ప‌టికీ ఎంతో ప‌రిణ‌తి ఉన్న ద‌ర్శ‌కుడిగా చేయ‌డం విశేషం. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగుంటుంది. సంగీతం ఏఆర్ రెహ‌మాన్ కాగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటుంది.

అయితే ఈ మూవీలో ఎన్నో ప్ల‌స్ పాయింట్స్ ఉన్నా కొన్ని మైన‌స్ పాయింట్స్ కూడా ఉన్నాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం, అత్యున్న‌త ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో సినిమాను నిర్మించ‌డం, ఇంట‌ర్వ‌ల్ బ్లాక్ వంటివి ప్ల‌స్ పాయింట్స్ కాగా.. సినిమా నిడివి, అన‌వస‌ర‌పు స‌న్నివేశాలు, అవ‌స‌రం లేని డ్రామా, అర్థం ప‌ర్థం లేని కొన్ని సీన్లు, ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించే సీన్లు.. చాలా ఉన్నాయి. అందువ‌ల్ల ఇవి మైన‌స్ పాయింట్స్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే మొత్తంగా చూస్తే యాక్ష‌న్‌, డ్రామా చిత్రాల‌ను కోరుకునే వారు కోబ్రా మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అది కూడా అంత‌సేపు చూసే ఓపిక ఉంటే. లేదంటే లైట్ తీసుకోవ‌డ‌మే బెట‌ర్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now