Mukul Rohatgi : ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ వచ్చింది ఈయన వల్లే.. ఎవరీ ముకుల్‌ రోహత్గీ..?

October 28, 2021 5:44 PM

Mukul Rohatgi : ఎన్‌సీబీ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ వచ్చింది. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దాదాపుగా 20 రోజులకు పైగానే ఆర్యన్‌ జైలులో ఉన్నాడు. పైగా షారూఖ్‌ఖాన్‌కు చెందిన లీగల్‌ టీమ్‌లో హేమాహేమీల్లాంటి లాయర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆర్యన్‌కు బెయిల్‌ తేవడంలో విఫలం అయ్యారు.

Mukul Rohatgi is the cause for aryan khan bail who is he

అయితే వచ్చీరాగానే ముకుల్‌ రోహత్గీ బలమైన వాదనలు వినిపించి చాలా సులభంగా బెయిల్‌ వచ్చేలా చేశారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోతోంది. అయితే ఇంతకీ అసలు ముకుల్‌ రోహత్గీ ఎవరు ? ఈయన విశేషాలు ఏమిటి ? అంటే..

ముకుల్‌ రోహత్గీ 14వ అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేశారు. ఈయనకు 66 ఏళ్లు. సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌గా ఈయనకు అపారమైన అనుభవం ఉంది. అలాగే గతంలో ఈయన అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పదవిలోనూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ఈయన అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేశారు.

అనేక సంక్లిష్టమైన కేసులను వాదించిన లాయర్ గా ఆయనకు పేరుంది. ఈయన 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో గుజరాత్‌ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించారు. అలాగే నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌ కు సంబంధించిన కేసులో అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌గా ఈయన అద్భుతంగా పనిచేశారు.

సీబీఐ స్పెషల్‌ జడ్జి బీహెచ్‌ లోయా మృతి కేసులో ఈయన ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియామకం అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు ఈయనకు రూ.1.20 కోట్ల ఫీజును చెల్లించింది. అది ఒక హైప్రొఫైల్‌ కేసు కావడం విశేషం. ఈ కేసులో విచారణ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముకుల్‌ రోహత్గీ కోర్టు నిర్ణయాన్ని్ స్వాగతించారు. ఇది ఏప్రిల్‌ 2018లో జరిగింది.

ఇక మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి ముకుల్‌ రోహత్గీ స్నేహితులు. తమ స్నేహం గురించి ఇద్దరూ అప్పుడప్పుడు చెబుతుండేవారు. ఇక ముకుల్‌ రోహత్గీ తండ్రి జడ్జి కావడం విశేషం. ఆయన పేరు అవధ్‌ బెహరి రోహత్గీ. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముకుల్‌ రోహత్గీ నడిచారు. గొప్ప లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. తరువాత న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

ప్రారంభంలో ఆయన యోగేష్‌ కుమార్‌ సభర్వాల్‌ వద్ద పనిచేశారు. తరువాత ఢిల్లీ హైకోర్టుకు 36వ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం సొంతంగా సీనియర్‌ అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 1993లో ముకుల్‌ రోహత్గీ ఢిల్లీ హైకోర్టు చేత సీనియర్‌ కౌన్సిల్‌గా నియామకం అయ్యారు. అనంతరం 1999లో అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా నియామకం అయ్యారు. ఆయన భార్య పేరు సుధ. ఆమె కూడా లాయర్‌. కాగా ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now