కరోనా రాకూడ‌ద‌ని పాల‌లో న‌ల్ల ఉప్పు క‌లిపి తాగాడు.. చ‌నిపోయాడు..!

November 13, 2021 12:24 PM

క‌రోనా తీవ్ర‌రూపం దాల్చిన ద‌శ‌లో ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొంద‌రైతే అతి జాగ్ర‌త్త‌లు పాటించ‌బోయి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు. కొంద‌రు ఏకంగా ప్రాణాల‌నే పోగొట్టుకున్నారు. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే తాజాగా చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

man died by consuming milk mixed with black salt

క‌రోనా రావొద్ద‌ని చెప్పి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు క‌షాయాలు, మూలిక‌ల‌ను తీసుకోవ‌డం, వివిధ ర‌కాల పండ్లు, ఆహారాల‌ను తిన‌డం మామూలే. అయితే ఆ యువ‌కుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి ఓ చిట్కా పాటించాడు. దీంతో ప్రాణాల‌ను కోల్పోయాడు. ఈ సంఘ‌ట‌న హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మచ్చ బొల్లారం పరిధిలోని చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్ ​(30) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఎవ‌రో చెప్ప‌గా విన్న సలహాతో సురేశ్ కూడా అలాగే చేశాడు. అత‌ను అలా తాగ‌డ‌మే కాక అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కూడా తాగారు. ఈ విధంగా వారు కొంతకాలంగా తాగుతున్నారు.

అయితే తాజాగా వారు య‌థావిధిగా పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికే ముగ్గురూ వాంతులు చేసుకున్నారు. దీంతో స్థానికులు వారిని సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ ప‌రిస్థితి విష‌మంగా ఉండగా అత‌న్ని అక్క‌డి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ అత‌ను ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడు. కాగా అతని భార్య, తల్లికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now