Business Idea : కోడి ఈక‌లతో కోట్లు సంపాదిస్తున్నారు.. ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

September 30, 2022 7:13 PM

Business Idea : నేటి యువత ప్రతి విషయంలోనూ కొత్త ఆలోచనతో ముందుకు దూసుకుపోతున్నారు. ఎందుకు పనికిరావు అనే వస్తువులతోనే కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటి చెబుతున్నారు. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఆలోచనే వాస్తవరూపం దాల్చితే ఎలా ఉంటుంది అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు చెప్పబోయే విషయం.

జైపూర్‌కు చెందిన ముదిత, రాధేష్ దంపతులు కోడి ఈకలతో ఒక వినూత్న ప్రయత్నం ప్రారంభించారు.  కోడి ఈకలతో దుస్తులు తయారుచేసి కోట్ల రూపాయల‌ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొదట్లో వీరి ఐడియాను చూసి వెక్కిరించినవారే ఆశ్చర్యపోయేలా చేశారు ఈ దంపతులు. ఒకరోజు రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న ఓ చికెన్ దుకాణంలో నిలబడి ఉండగా, కోడి ఈకలను చేతితో తాకాడు రాధేష్. అనుకోకుండా అతడికి ఓ ఆలోచన మెదడులో మెదిలింది. తనకి వచ్చిన ఆలోచన గురించి ముదితతో చెప్పగా.. ఇద్దరూ కలిసి వెంటనే దానిని ప్రాజెక్ట్ గా మొదలుపెట్టారు. తమకు వచ్చిన ఐడియాతో ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించారు.

Business Idea couple making cloths with chicken feathers and earns in crores
Business Idea

జైపూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ లలో రాధేష్ తో కలిసి ముదిత ఎంఏ చేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారుచేసే దానిపై  ప్రాజెక్టు చేశారు. కాలేజీలో చదవుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చి.. ఆలోచనను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం అంత తేలికగా అయ్యే పనికాదు. రాధేష్ కి వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మధ్యలో పరిస్థితులు కూడా అనుకూలించలేదు. అయినా సరే తాము అనుకున్న లక్ష్యం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తూ కోడి ఈకలతో దుస్తులు తయారుచేస్తూ ఏకంగా ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఈ దంప‌తులు కోట్లలో టర్నోవర్ ని సొంతం చేసుకున్నారు.  అయితే వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు 8 సంవత్సరాల‌ సమయం పట్టింది.

2010లో ప్రారంభమైన రాధేష్ ఆలోచన 2018లో కార్యరూపం దాల్చింది. దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు. వాస్తవానికి రాధేష్ కుటుంబం పూర్తి శాకాహరులు. దీంతో రాధేష్ కుటుంబ సభ్యులు ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిరాకరించారు. అంతేకాకుండా వ్యాపార పనులకు సంబంధించి ఎలాంటి సహకారం కూడా కుటుంబం నుంచి అందలేదు. ఆ సమయంలో ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాధేష్. అయినా సరే ఇబ్బందులు పడుతూనే తమ లక్ష్యం సాధించడానికి ముందుకు అడుగులు వేశారు రాధేష్, ముదిత దంపతులు.

గతంలో కోడి ఈకలతో దుస్తులు తయారుచేసే వ్యాపారాన్ని ఎవరూ చేసిన దాఖలాలు కూడా ఎక్కడలేవు. బుక్స్, ఇంటర్నెట్ లోనూ దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కోడి ఈకలను దుస్తులుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు రాధేష్ దంపతులు. అయితే కోడి ఈకలను ఉపయోగించి దుస్తులు తయారుచేయడం వరకు వారి ఆలోచన బాగానే ఉంది. ఆ తర్వాతే రాధేష్ దంపతులకు అసలు సమస్య మొదలైంది. తయారుచేసిన దుస్తుల అమ్ముడుపోవడం అనేది వీరికి కష్టతరంగా మారింది. సాధారణంగా కోడి ఈకలతో తయారుచేసిన దుస్తులంటే ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే కోడి ఈకలతో తయారుచేసిన శాలువాలకు మన దేశంతో పోలిస్తే విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలుసుకుని అప్పటి నుంచి వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన రాధేష్ ఆలోచన ఇప్పుడు ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. గడిచిన రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా వ్యాపారం చేయగా.. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.2.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కళాశాల స్థాయిలో పుట్టిన ఒక ఆలోచన నేడు వందలాది మందికి ఉపాధి కల్పించి రాధేష్ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాధేష్ కి సంబంధించిన ఈ పరిశ్రమ విషయం బయటకు రావడంతో న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now