
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా వార్తలు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తోంది. షూటింగ్ వేగంగా సాగుతుండగా, త్వరలోనే విడుదలకు సిద్ధం చేసే పనిలో టీమ్ ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సూర్య మరో స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో బజ్ నడుస్తోంది. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించనున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ ఘోర పరాజయం తర్వాత పరశురామ్‌కు ఇది డూ ఆర్ డై ప్రాజెక్ట్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ తో చాన్స్ వచ్చినా..
ఈ సూర్య-పరశురామ్ చిత్రాన్ని మళ్లీ దిల్ రాజు నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ ఫియాస్కో తర్వాత కూడా పరశురామ్‌కు మరో అవకాశం ఇవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పరశురామ్ కెరీర్ విషయానికి వస్తే గీత గోవిందం బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయనకు మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేసే అవకాశం లభించింది. అయితే ఆ సినిమా నెగటివ్ టాక్‌ను ఎదుర్కొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ తో తన ప్రతిభను నిరూపిస్తారని భావించినా, ఆ సినిమా బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొని పరశురామ్ విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది.
పాత కథాంశాలతోనే..?
ఇండస్ట్రీలో పలువురు పరశురామ్‌ను పాత కథాంశాలకే పరిమితమైన దర్శకుడిగా అభివర్ణిస్తున్నారు. గీత గోవిందం అప్పట్లో ఎంటర్టైన్మెంట్ కారణంగా వర్క్ అయిందని, ఆ తర్వాతి సినిమాలు మాత్రం ట్రోలింగ్‌కు గురయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ దిల్ రాజు మరోసారి ఆయనపై నమ్మకం పెట్టడం ఆసక్తికరంగా మారింది. సూర్య-పరశురామ్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సమాచారం. ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రధాన చర్చ ఒక్కటే-ఈ సినిమాతో పరశురామ్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తారా? లేక ఇది ఆయన దర్శకుడిగా కెరీర్‌కు తుది అంకంగా మారుతుందా? అని చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.








