శ్రీకృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

August 28, 2021 8:12 PM

హిందువులు ఎన్నో పూజా కార్యక్రమాలను, పండుగలను ఆచరిస్తూ వాటిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. హిందూ మతం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణాష్టమినే శ్రీ కృష్ణ జయంతి, గోకులాష్టమిగా కూడా పిలుస్తారు. ఇకపోతే ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 30వ తేదీన వచ్చింది. ఆరోజు ప్రతి తల్లి తమ చిన్నారిని కృష్ణుడి వేషధారణలో అలంకరించి ఎంతో సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు.

అసలు శ్రీకృష్ణాష్టమిని జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు చాలామందికి తెలియక పోయినప్పటికీ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. లోక సంరక్షణార్ధం, లోక ధర్మం కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలుసు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు మధురలో చెరసాలలో దేవకికి జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణుడు శుక్లపక్షం అష్టమి తిథి రోజున విష్ణువు 8వ అవతారంగా జన్మించడమే కాకుండా దేవకికి 8వ సంతానంగా జన్మించాడు.

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించడానికి గల కారణం భూలోకంలో కృష్ణుడి మేనమామ అయిన కంసుడు చేస్తున్న అరాచకాలకు, దాష్టీకాలతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలోనే కంసుడి సంహరణార్థం విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారంలో జన్మించి కంసుడిని సంహరించాడు. అదేవిధంగా పాండవులకు అండగా నిలిచి ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని ఓడించాడు. చావు పుట్టుకల పరమార్థాన్ని భగవద్గీత ద్వారా తెలియజేశాడు. విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో ధర్మాన్ని కాపాడి, కంసుని వధించి ప్రజలకు విముక్తి కల్పించడం చేత ప్రజలు ఎంతో సంతోషంతో ప్రతి ఏటా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని పూజించి కృష్ణుడి ఆలయాలను సందర్శిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now