
జియో ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ ఫిబ్రవరి 11న తన జియోఫైనాన్స్ యాప్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs) కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వివిధ బ్యాంకులు, NBFCలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఒకే వేదికపై పరిశీలించి, పోల్చి, నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. రిటైల్ వినియోగదారుల కోసం సులభమైన, సురక్షితమైన, డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవలను ఒకే చోట అందించడమే దీని లక్ష్యమని సంస్థ తెలియజేసింది.
ఒకే చోట అన్ని వివరాలు..
దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్థిరమైన, తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఎంపికగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే వడ్డీ రేట్లు పోల్చడం, కాలపరిమితులు అర్థం చేసుకోవడం, వేర్వేరు ప్లాట్‌ఫార్మ్‌లలో పెట్టుబడులను ట్రాక్ చేయడం వంటి అంశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తొలగించేందుకు పూర్తిస్థాయి డిజిటల్ ప్రాసెస్‌ను అందిస్తున్నామని జియో ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో సుర్భే ఎస్. శర్మ తెలిపారు. వినియోగదారులు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ విధానంలో ఎఫ్‌డీలను కనుగొని, పోల్చి, బుక్ చేసి, ట్రాక్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..
వినియోగదారులు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరాం ఫైనాన్స్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్ వంటి పలు బ్యాంకులు, NBFCలు అందించే ఎఫ్‌డీలను ఒకే చోట పోల్చుకోవచ్చు. వడ్డీ రేటు, కాలపరిమితి ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు. సంవత్సరానికి గరిష్టంగా 8.15 శాతం వరకు వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయని జియో సంస్థ తెలిపింది. ముఖ్యంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, NBFCల నుండి అధిక వడ్డీ ఎంపికలు లభ్యమవుతున్నట్లు వివరించింది. ఇక ఈ ప్రక్రియ అంతా మానవ జోక్యం లేకుండా నిమిషాల్లోనే పూర్తవుతుంది. సులభంగా ఎఫ్‌డీ బుకింగ్ పూర్తి చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైన డిజిటల్ ప్రక్రియ అని సంస్థ తెలిపింది.
వివరాలు మరింత స్పష్టంగా..
కాలపరిమితి, పన్ను వర్తింపు, లాక్-ఇన్ షరతులు, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు వంటి వివరాలు స్పష్టంగా చూపిస్తారు. ఒకే డ్యాష్‌బోర్డ్‌లో ప్రస్తుత, ముగిసిన ఎఫ్‌డీల వివరాలు, రాబడులు, మెచ్యూరిటీ తేదీలు, రెన్యువల్ రిమైండర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను Blostem Fintech Private Limited సాంకేతిక భాగస్వామ్యంతో అమలు చేస్తున్నట్లు జియో తెలిపింది. ఈ సంస్థ పలు బ్యాంకులు, NBFCలతో బిజినెస్ కారస్పాండెంట్ లేదా టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్‌గా అనుసంధానమై ఉంది. ఎఫ్‌డీ ఎంపికలను అన్వేషించేందుకు వినియోగదారులు జియోఫైనాన్స్ యాప్ డౌన్‌లోడ్ చేసి హోమ్‌పేజీలోని Fixed Deposits విభాగంలోకి వెళ్లి సులభమైన దశల ద్వారా బుకింగ్ పూర్తి చేయవచ్చు. దీంతో ఎఫ్‌డీ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత దాన్ని అందులోనే సులభంగా ట్రాకింగ్ లేదా రెన్యువల్ చేసుకోవచ్చు.
Note/Disclaimer: ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆయా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ నిబంధనలు, ముందస్తు ఉపసంహరణ షరతులను పూర్తిగా చదవగలరు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సంబంధిత యాప్ లేదా బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీలకు చెందిన వెబ్‌సైట్లను, అధికారిక ప్రకటనలను సందర్శించి పూర్తి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.







