అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని టీమ్స్‌పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ..

January 26, 2026 7:45 PM
Amazon mass layoffs 16000 employees January 2026 India impact
అమెజాన్‌లో మరో విడత భారీ లేఆఫ్స్.. ఉత్కంఠలో ఐటీ నిపుణులు. Photo Credit: Amazon.

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్, క్లౌడ్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. జనవరి 27 నుంచి కొత్త దశలో లేఆఫ్స్‌ను అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విడతలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశముందని సమాచారం. ఇది 2026 మధ్య నాటికి మొత్తం 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే విస్తృత పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగమని తెలుస్తోంది. ఈసారి లేఆఫ్స్ భౌగోళికంగా మరింత విస్తృతంగా ఉండనున్నాయని, ముఖ్యంగా భారత్‌లోని అమెజాన్ టీమ్‌లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లైండ్, రెడిట్ వంటి ఉద్యోగుల ఫోరమ్‌లలో సాగుతున్న చర్చలు, అంతర్గత సమాచారాన్ని ఉటంకిస్తూ, రాబోయే రోజుల్లో ఉద్యోగ కోతలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు అధికంగా ప్రభావితమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

గ‌తంలో అమ‌లు చేసిన కోత‌ల క‌న్నా అధికం..

అమెజాన్‌లో ఈ పునర్వ్యవస్థీకరణ 2025 చివర్లో ప్రారంభమైంది. అక్టోబర్ 2025లో మొదటి దశలోనే దాదాపు 14,000 వైట్-కాలర్ ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు రెండో దశలో మరో 16,000 ఉద్యోగాలను కోతకు గురిచేస్తే, మొత్తం లేఆఫ్స్ సంఖ్య దాదాపు 30,000కి చేరనుంది. రాయిటర్స్ గతంలో ప్రచురించిన నివేదిక ప్రకారం, అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పట్లో 14,000 ఉద్యోగాల తొలగింపును కంపెనీ ధ్రువీకరించింది. తాజా దశ అమలైతే, 2022–2023 మధ్యకాలంలో చేసిన 27,000 ఉద్యోగ కోతలను కూడా ఇది మించిపోతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ, ఈ లేఆఫ్స్ ప్రధానంగా కార్పొరేట్ విభాగంలోని సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులపై మాత్రమే ప్రభావం చూపనున్నాయి.

భార‌త మెట్రో న‌గ‌రాల‌పై ప్ర‌భావం..

ఈసారి ఉద్యోగ కోతలు అమెజాన్‌లోని కీలక విభాగాలను తాకనున్నాయని సమాచారం. AWS, ప్రైమ్ వీడియో, రిటైల్ ఆపరేషన్స్, అలాగే కంపెనీ అంతర్గత హెచ్‌ఆర్ విభాగమైన పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) విభాగాల్లో కోతలు ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న భారత కార్పొరేట్ టీమ్‌లు అధిక ప్రమాదంలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ కోతల ప్రక్రియ జనవరి 27 వారం ప్రారంభంలోనే మొదలయ్యే అవకాశముందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. రెడిట్, బ్లైండ్, లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అనామకంగా పోస్టులు చేసిన కొందరు ఉద్యోగులు, ఇప్పటికే మేనేజర్లు, సీనియర్ లీడర్లు రాబోయే కోతలపై సంకేతాలు ఇచ్చారని పేర్కొన్నారు. పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)లో ఉన్న ఉద్యోగులకు ముందుగానే సమాచారం అందే అవకాశముందని కూడా చర్చ సాగుతోంది.

అమెరికాలోని ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే నోటీసులు..

ఇప్పటికే 1,000 నుంచి 2,000 మంది ఉద్యోగులకు అమెరికా చట్టం ప్రకారం తప్పనిసరిగా ఇచ్చే WARN నోటీసులు పంపినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఉద్యోగ కోతల సమయం, పరిమాణంపై అమెజాన్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఉద్యోగ కోతల వెనుక కారణాలపై కూడా చర్చ కొనసాగుతోంది. అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ పలుమార్లు మాట్లాడుతూ, ఇవి తాత్కాలిక ఖర్చు తగ్గింపు చర్యలు కాదని, కేవలం ఆర్థిక కారణాల వల్ల కూడా కాదని స్పష్టం చేశారు. అలాగే కృత్రిమ మేధస్సు (AI) వల్లనే ఉద్యోగాలు పోతున్నాయన్న వాదనను కూడా ఆయన ఖండించారు. అసలు లక్ష్యం సంస్థలో పెరిగిపోయిన బ్యూరోక్రసీని తగ్గించడం, అనవసర మేనేజ్‌మెంట్ పొరలను తొలగించడం, నిర్ణయాల్లో వేగం తీసుకురావడమేనని ఆయన పేర్కొన్నారు.

ఏఐ కూడా ఒక కార‌ణం..?

అయితే వాస్తవానికి AI కూడా ఈ మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అమెజాన్ ఇప్పటికే హెచ్‌ఆర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఆటోమేషన్‌ను వేగంగా పెంచుతోంది. సామర్థ్యాన్ని పెంచడం కోసం మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలను తగ్గిస్తూ, నేరుగా ఉత్పత్తులు, సేవల అభివృద్ధిలో పాల్గొనని పోస్టులను తొలగించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలతో అమెజాన్‌లో పనిచేస్తున్న వేలాది ఉద్యోగుల్లో అనిశ్చితి, ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారత టెక్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment