చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల కూడా యువ‌త చ‌దువుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, అందువ‌ల్ల యువ‌త ముందు చ‌దువుపై దృష్టి పెట్టాల‌ని ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ అన్నారు.

April 9, 2026 3:13 PM
Rajinikanth speaking to media at Chennai airport about youth and his movie with Kamal Haasan.
చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్. Photo Credit: Being Southee/Facebook.

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల కూడా యువ‌త చ‌దువుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, అందువ‌ల్ల యువ‌త ముందు చ‌దువుపై దృష్టి పెట్టాల‌ని ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ అన్నారు. ఆయ‌న తాజాగా చెన్నై విమానాశ్ర‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎయిర్ పోర్టులో క‌నిపించ‌గానే జ‌ర్న‌లిస్టులు ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల్లో ముంచెత్తారు. ముఖ్యంగా విజ‌య్ న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ చిత్ర విడుద‌ల ఆల‌స్యం అవుతుండడం, విజ‌య్ కారు వెంట‌ప‌డి యువ‌త ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌డం, అలాగే త్వ‌ర‌లో క‌మ‌ల‌హాస‌న్‌తో క‌ల‌సి న‌టించ‌నున్న మూవీ విష‌యాల గురించి జ‌ర్న‌లిస్టులు ఆయ‌న‌ను ప్ర‌శ్న‌లు అడిగారు. అయితే ఆయ‌న జ‌న‌నాయ‌గ‌న్ విడుద‌ల‌పై స్పందించ‌లేదు. కానీ మిగిలిన రెండు విష‌యాల‌కు స‌మాధానాలు చెప్పారు.

హీరోల కార్ల వెంట ప‌డొద్దు..

ఇటీవ‌ల కొంద‌రు యువ‌కులు న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కారు వెంట ప‌డి ప్ర‌మాదాల బారిన ప‌డిన నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టులు ర‌జ‌నీకాంత్‌ను ఆ విష‌యంపై ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ ప్ర‌స్తుతం యువ‌త న‌టీన‌టుల వెంట ప‌డుతూ స‌మ‌యం వృథా చేసుకుంటున్నారని అన్నారు. ముందు చ‌దువుల‌పై దృష్టి పెట్టాల‌ని, త‌ల్లిదండ్రులను ప‌ట్టించుకోవాల‌ని అన్నారు. హీరోలు లేదా హీరోయిన్ల కార్ల వెంట ప‌డితే ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని, ఇలాంటి విష‌యాల్లో యువ‌త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చ‌దువుకునే వ‌య‌స్సులో పూర్తిగా చ‌దువుల‌పైనే శ్ర‌ద్ధ పెట్టాల‌ని, స‌రైన చ‌దువు చ‌ద‌వ‌క‌పోతే భవిష్య‌త్తులో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంద‌న్నారు. ఈ స‌మ‌యంలో చ‌దువుపై అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌ద‌ని, స‌మ‌యాన్ని వృథా చేయ‌వ‌ద్ద‌ని, చ‌దువును ప‌క్క‌న పెడితే జీవితంలో చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నారు.

ఆ అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి..

ప్ర‌స్తుతం యువ‌త మ‌ద్యానికి, గంజాయి వంటి మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస అవుతున్నార‌ని, ఈ క‌ల్చ‌ర్ మంచిది కాద‌ని ర‌జ‌నీకాంత్ అన్నారు. యువ‌త‌కు ఎంతో భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, డ్ర‌గ్స్ మ‌త్తులో ప‌డి అంద‌మైన భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని అన్నారు. అలాంటి దుర‌ల‌వాట్లు క‌లిగిన ఫ్రెండ్స్ ఎవ‌రికైనా ఉంటే వారికి త‌క్ష‌ణ‌మే దూరంగా ఉండాల‌న్నారు. ఇక క‌మ‌ల‌హాస‌న్‌తో క‌లిసి తాను న‌టించ‌నున్న సినిమా వ‌చ్చే ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. ర‌జ‌నీకాంత్ ఇటీవ‌లే జైల‌ర్ 2 మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా, ఆయ‌న త‌న త‌రువాతి సినిమాను క‌మ‌ల‌హాస‌న్‌తో క‌లిసి మల్టీ స్టార‌ర్ మూవీగా చేయ‌నున్నారు. దీనికి సీబీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే విజ‌య్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న నేప‌థ్యంలో ఆయన ఫ్యాన్స్ గురించి ర‌జ‌నీకాంత్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment