‘రామాయణం’ రణబీర్ లుక్ లీక్.. ఆ విగ్‌పై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్!

ర‌ణ‌బీర్ క‌పూర్‌, సాయిప‌ల్లవి రాముడు, సీత‌గా న‌టిస్తున్న రామాయ‌ణం చిత్రం నుంచి లీకైన ఫొటోల‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ర‌ణ‌బీర్ క‌పూర్ ధ‌రించిన విగ్‌పై ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

March 3, 2026 10:44 PM
Netizens trolling Ranbir Kapoor's leaked look from Ramayana movie.
‘రామాయణం’ షూటింగ్ నుండి లీకైన రణబీర్ కపూర్ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Photo Credit: Reddit/BollyNewsAndGossips.

ర‌ణ‌బీర్ క‌పూర్‌, సాయిప‌ల్లవి రాముడు, సీత‌గా న‌టిస్తున్న రామాయ‌ణం చిత్రం నుంచి లీకైన ఫొటోల‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ర‌ణ‌బీర్ క‌పూర్ ధ‌రించిన విగ్‌పై ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది విడుద‌ల కానున్న అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఈ మూవీ ఒక‌టి కాగా అంత‌టి భారీ ఖర్చు పెడుతూ కూడా స‌రైన విగ్‌ను వాడ‌లేరా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నితేష్ తివారీ తెర‌కెక్కిస్తున్న రామాయ‌ణం చిత్రంలో రాముడిగా న‌టిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్ ఫొటో ఒక‌టి ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఆ ఫొటో ఎప్పుడు తీసింది అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. కానీ ఆ ఫొటోలో ర‌ణ‌బీర్ లుక్ అస‌లు ఏమాత్రం బాగాలేద‌ని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఆది పురుష్ సినిమాలా ఈ సినిమా కూడా మారుతుందా.. అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆక‌ట్టుకోని ర‌ణ‌బీర్ విగ్‌..

ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ రామాయ‌ణం చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్‌, సీత‌గా సాయిప‌ల్ల‌వి, హ‌నుమంతుడిగా స‌న్నీ డియోల్‌, రావ‌ణుడిగా య‌ష్‌, ల‌క్ష్మ‌ణుడిగా ర‌వి దూబే న‌టిస్తున్నారు. అయితే రాముడి పాత్ర‌లో న‌టిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్ లుక్‌కు చెందిన ఫొటో రెడిట్‌లో వైర‌ల్ అయింది. ఆ ఫొటోను చూస్తే సెట్స్ నుంచి లీకైన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆ ఫొటోపై నెటిజ‌న్లలో పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. రెడిట్‌లో వైర‌ల్ అవుతున్న ఆ ఫొటోలో ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడి పాత్ర‌లో ధోతి, జ‌నేయు ధ‌రించి పైభాగాన్ని క‌ప్పే న‌లుపు రంగు కేప్‌తో క‌నిపించారు. అయితే ఆయ‌న ధ‌రించి విగ్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ ఫొటో ఎప్పుడు తీసిందో క్లారిటీ లేదు. కానీ ర‌ణ‌బీర్ విగ్ మాత్రం నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌లేదు.

నెటిజ‌న్ల తీవ్ర విమ‌ర్శ‌లు..

చాలా మంది నెటిజన్లు ఈ లుక్‌ను తీవ్రంగా విమర్శించారు. కొందరు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదా? అంటూ వ్యాఖ్య‌లు చేశారు. 400 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఉందని చెబుతున్నారు. అయినా సరైన విగ్ కూడా ఏర్పాటు చేయలేకపోయారా? అని మ‌రొక‌రు ప్రశ్నించారు. బాలీవుడ్‌లో నకిలీ జుట్టు, గడ్డం విషయంలో ఎప్పుడూ సమస్యే ఉంటుంది. ఏ సినిమా చూసినా తెలుస్తుంద‌ని ఇంకొక‌రు అన్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా ఇటీవ‌ల పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించిన భారీ బడ్జెట్‌ను కూడా కొందరు ఎద్దేవా చేశారు. 2023లో విడుదలైన ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా నుంచి పాఠాలు నేర్చుకోలేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆదిపురుష్ నుంచి ఏమీ నేర్చుకోలేదనిపిస్తోంది అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. ఈ సినిమా మొత్తం సీజీఐపైనే ఆధారపడబోతుందా? ఆదిపురుష్‌లాగేనా? అని సందేహం వ్యక్తం చేశారు.

ఎంతో బాధ్య‌త ఉంది: రెహ‌మాన్

ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ ఆ సమయంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ భారతీయ చిత్రంగా ప్రచారం పొందినా, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 350 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక రామాయణం చిత్రానికి ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మ‌ర్‌, ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ ఫేమ్‌ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్, అలాగే అవెంజర్స్ చిత్రాలతో పేరుగాంచిన టెర్రీ నోటరీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. కాగా ఏఆర్ రెహమాన్ ఇటీవ‌ల‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది త‌మ‌ ఇద్దరికీ కూడా భయానకంగా అనిపించే బాధ్యత అని, ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన, ప్రతి భారతీయుడికి పరిచయమైన ఇతిహాసానికి సంగీతం అందిస్తున్నామ‌ని అన్నారు. ప్రతి భారతీయుడికి తెలిసిన ఈ మహాకావ్యాన్ని కొత్తగా ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఉంద‌ని తెలిపారు.

ఈ ఏడాది దీపావ‌ళికి..

రామాయ‌ణం చిత్రాన్ని నమిత్ మల్హోత్రా త‌న ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ఆధ్వ‌ర్యంలో నిర్మిస్తున్నారు. గతేడాది జూలైలో ఫస్ట్ లుక్ విడుదలైంది. రామాయణం: పార్ట్ వన్ 2026 అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రంపై లీకైన ఫోటోలు కొత్త చర్చకు తెరతీశాయి. విడుదలకు ముందే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. మ‌రి సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment