
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో గంభీర్ తమ తదుపరి మ్యాచ్ గురించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంజు శాంసన్ ఒక గొప్ప ప్లేయర్ అని, అతనికి టీం నుంచి కావల్సిన సపోర్ట్‌ను అన్ని విధాలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సంజు ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ అతనికి ఎంతో ప్రత్యేకమని, ఈ మ్యాచ్‌లో అతను తన సత్తా ఏంటో చూపించాడని కొనియాడారు. సంజు ఒక అంతర్జాతీయ స్థాయి ప్లేయర్ అని తాను ఏనాడో చెప్పానని గుర్తు చేశారు. సంజులో అద్భుతమైన టాలెంట్ ఉందని, అతను ఇలాంటి ఇన్నింగ్స్ మరెన్నింటినో ఆడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడబోతున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడారు.
ఇంగ్లండ్‌ను ఓడిస్తాం: గంభీర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఒక వరల్డ్ క్లాస్ టీమ్ అని గంభీర్ అన్నారు. అందులో ఉన్న ఆటగాళ్లు ఎంతో అద్భుతమైన ఆట ఆడుతారని, అయితే ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఆ జట్టుతో ఆడడం నిజంగా తమకు సవాలేనని అన్నారు. అయితే టీమిండియా మరోమారు ప్రత్యేకంగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు తాము అన్ని మ్యాచ్‌లలోనూ శక్తిమేర రాణిస్తూనే ఉన్నామని, కానీ ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం చాలా బలంగా ఉందని అన్నారు. వారితో తలపడి గెలవాలంటే ప్రత్యేక ప్రయత్నం అవసరమని పునరుద్ఘాటించారు. ఇంగ్లండ్‌ను ఓడించి ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్లో ఆడుతామని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు.
సంజు అజేయ ఇన్నింగ్స్..
వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సంజు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 195 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు సంజు ఓవైపు మంచి బంతులను డిఫెన్స్ ఆడుతూ సింగిల్స్ తీస్తూనే ఇతర బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో అతను 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ లక్ష్య ఛేదనలో 5 వికెట్లను కోల్పోయి 199 పరుగులు చేసింది. ఇక భారత్ సెమీఫైనల్ 2లో భాగంగా మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే మార్చి 8వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆడుతుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరూ టీమిండియా మరోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నారు.












