క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల ఆహారాల‌ను రోజువారి డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్ సౌర‌భ్ సెథి తెలిపారు.

February 26, 2026 12:01 PM
Healthy foods recommended for cancer prevention by Dr. Saurabh Sethi.
క్యాన్సర్ నిరోధక ఆహారాల ప్రాముఖ్యతను వివరిస్తున్న డాక్టర్ సౌరభ్ సెథి. Photo Credit: IStock.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల ఆహారాల‌ను రోజువారి డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్ సౌర‌భ్ సెథి తెలిపారు. ఎయిమ్స్‌, హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల్లో శిక్ష‌ణ పొందిన ఆయ‌న, మనం తినే ఆహారాల‌కు అనుగుణంగానే క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌డం లేదా నాశ‌నం అవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ప్ర‌తి ఒక్క‌రికి క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ ఉంటుంద‌ని, క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకునే మ్యాజిక్ షీల్డ్ లాంటిది ఏదీ లేద‌ని, కానీ కొన్ని ర‌కాల జీవన‌శైలి మార్పులు చేసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని తెలిపారు. క్యాన్స‌ర్ రాకుండా చేయ‌డంలో డైట్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌న్నారు.

చిల‌గ‌డ‌దుంప‌లు, బ్రోక‌లీ మొల‌క‌లు, మైక్రోగ్రీన్స్‌..

చిల‌గ‌డ‌దుంప‌లు ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉంటాయి. వాటిల్లో ఆంథోస‌య‌నిన్స్‌, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. ల్యాబ్ అధ్య‌య‌నాల్లోనూ ఈ స‌మ్మేళ‌నాలు క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధిని అడ్డుకోగ‌ల‌వ‌ని తేలింది. క‌నుక రోజువారి ఆహారంలో చిల‌గ‌డ‌దుంప‌ల‌ను చేర్చుకోవాల‌ని డాక్ట‌ర్ సెథి సూచించారు. అలాగే బ్రోక‌లీ మొల‌క‌లు, మైక్రోగ్రీన్స్‌ను కూడా తీసుకోవాల‌ని సూచించారు. క్యాన్స‌ర్‌ను అడ్డుకునే సూప‌ర్‌ఫుడ్స్ గా ఇవి ప‌నిచేస్తాయ‌ని తెలిపారు. ఈ ఆహారాల్లో స‌ల్ఫోరాఫేన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది డిటాక్స్‌, యాంటీ ఆక్సిడెంట్ మార్గాల‌ను ఉత్తేజం చేస్తుంది. దీని వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవచ్చు. క‌నుక ఆయా ఆహారాల‌ను కూడా రోజువారి డైట్‌లో చేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

కివి పండ్లు, గ్రీన్ టీ..

కివి పండ్ల‌లో విట‌మిన్‌, ఫైబ‌ర్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారించ‌డంతోపాటు డీఎన్ఏకు మ‌ర‌మ్మ‌త్తులు జ‌రిగేలా చూస్తాయి. జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. విరేచ‌నం సాఫీగా అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నిరోధిస్తాయి. అందువ‌ల్ల కివి పండ్ల‌ను త‌ర‌చూ తినాల‌ని డాక్ట‌ర్ సెథి తెలిపారు. అలాగే గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెకిన్‌-3-గాల్లేట్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ట్యూమ‌ర్‌ల‌ను పెర‌గ‌కుండా అడ్డుకుంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల గ్రీన్ టీని కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

గ్రీన్ బీన్స్‌..

గ్రీన్ బీన్స్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అర క‌ప్పు గ్రీన్ బీన్స్‌ను తింటే సుమారుగా 8 గ్రాముల మేర ఫైబ‌ర్ ల‌భిస్తుంది. పెద్ద‌ల‌కు రోజుకు సాధార‌ణంగా 25 నుంచి 38 గ్రాముల మేర ఫైబ‌ర్ అవ‌స‌రం అవుతుంది. అయితే గ్రీన్ బీన్స్‌ను రోజూ తింటే ఫైబ‌ర్ అవ‌స‌రాల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు. అలాగే ఇవి పెద్ద‌పేగు క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పెద్ద‌పేగు ఆరోగ్యంగా ఉంటుంది. క‌నుక గ్రీన్ బీన్స్‌ను కూడా రోజూ తినాల‌ని ఆయ‌న తెలిపారు. క్యాన్స‌ర్ వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా అది రాక‌ముందే నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ఉత్త‌మ‌మ‌ని డాక్ట‌ర్ సెథి తెలిపారు. రోజూ మ‌నం తినే ఆహారాల్లో ఆయా మార్పుల‌ను చేయ‌డం ద్వారా ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని, క్యాన్స‌ర్ రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చ‌ని అన్నారు.

గమనిక/Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన మార్పులు లేదా డైట్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment