మనిషి స్థానాన్ని భర్తీ చేయడానికి కాదు.. సేవకే టెక్నాలజీ: మోదీ

దేశ‌ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమ మేథ‌స్సు (AI)పై భారత్‌ దృష్టికోణాన్ని స్పష్టంగా వెల్లడించారు. సాంకేతికత మనుషుల సామర్థ్యాన్ని విస్తరించాల్సిందే గానీ, సమాజ విలువలను దెబ్బతీయకూడదని ఆయన స్పష్టం చేశారు.

February 18, 2026 10:34 AM
PM Modi speaking about AI and humanity at the summit.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రసంగిస్తున్న మోదీ Photo Credit: PM Modi/X.

దేశ‌ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమ మేథ‌స్సు (AI)పై భారత్‌ దృష్టికోణాన్ని స్పష్టంగా వెల్లడించారు. సాంకేతికత మనుషుల సామర్థ్యాన్ని విస్తరించాల్సిందే గానీ, సమాజ విలువలను దెబ్బతీయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌కు మార్గదర్శక సూత్రంగా సర్వజన హితాయ, సర్వజన సుఖాయను పేర్కొన్న ప్రధాని, AI అభివృద్ధి అందరి సంక్షేమం, ఆనందం కోసం ఉండాలన్నారు. AI ని మానవ నాగరికతను మలుపుతిప్పే దశగా అభివర్ణించిన ప్రధాని, దీని దిశ సరిగా లేకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాంకేతికత మనుషులను భర్తీ చేయడానికి కాదు, సేవ చేయడానికి ఉంద‌ని స్పష్టం చేస్తూ, ఈ సమ్మిట్ ఉద్దేశం కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాకుండా సమానత్వం, అర్థవంతమైన ఫలితాలను సాధించడమేనని తెలిపారు.

విక‌సిత్ భార‌త్ 2047 ల‌క్ష్యానికి AI..

ఈ సమ్మిట్‌లో ప్రపంచ దేశాల అధినేతలు, మంత్రులు, టెక్నాలజీ దిగ్గజాలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ చర్చల్లో తరచూ పక్కన పడేసే గ్లోబల్ సౌత్ స్వరాలను ముందుకు తీసుకురావడమే భారత్ లక్ష్యమని ప్రధాని అన్నారు. AI అనేది ప్రజలు-గ్రహం-ప్రగతి అనే మూడు మూలస్తంభాలపై ఆధారపడి ఉండాలి.. అంటూ, సమాన డేటాసెట్లు, వాతావరణ పరిష్కారాలు, ప్రజారోగ్యం, బహుభాషా ల‌భ్య‌తకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. భారత్ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం వికసిత్ భారత్ 2047తో AI ని ప్రధాని నేరుగా అనుసంధానించారు. క్షయ, డయాబెటిక్ రెటినోపతి, ఎపిలెప్సీ వంటి వ్యాధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గుర్తించేలా AI వినియోగం జరుగుతోందని తెలిపారు. విద్యారంగంలో భారతీయ భాషల్లో వ్యక్తిగతీకరించిన అభ్యాసం గ్రామీణ విద్యార్థులకు ఉపయోగపడుతోందని, మహిళా పాడి రైతులకు టెక్నాలజీ తోడ్పాటునిస్తున్న ఉదాహరణను ప్రస్తావించారు. ప్రపంచం AI వల్ల విభజనలు పెరుగుతాయని భయపడుతున్న సమయంలో, భారత్ వాటిని కరిగిస్తోంద‌ని అన్నారు.

AI వినియోగం పెరుగుతోంది..

వ్యవసాయ సలహా వ్యవస్థలు, మట్టి విశ్లేషణ, వాతావరణ అంచనాల్లో AI వినియోగం పెరుగుతోందని, పురాతన హస్తప్రతులను డిజిటలైజ్ చేసి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నామని వివరించారు. AIలో లింగ, భాష, సామాజిక-ఆర్థిక పక్షపాతాలు తలెత్తే ప్రమాదాన్ని ప్రధాని అంగీకరించారు. భారత వైవిధ్యం కారణంగా ఈ సవాల్ మరింత క్లిష్టమని, ప్రాంతీయ భాషలు, గ్రామీణ సందర్భాలను ప్రతిబింబించే డేటా అవసరమని చెప్పారు. ఆధార్, UPI వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజయాన్ని గుర్తుచేస్తూ, ఇవి ప్రజాస్వామ్యంగా రూపొందించబడడ‌మే విస్తృత వినియోగానికి కారణమన్నారు. AIని వీటిపై అమలు చేస్తే సంక్షేమ పథకాల లక్ష్యసాధన, మోసాల గుర్తింపు, పట్టణ ప్రణాళిక మెరుగుపడుతాయని పేర్కొన్నారు.

AI ఉద్యోగాల‌ను తొల‌గించ‌దు..

AI ఉద్యోగాలను పూర్తిగా తొలగించదని, పనుల స్వభావం మాత్రమే మారుతుందని ప్రధాని స్పష్టం చేశారు. భయానికి ఉత్తమ ప్రత్యామ్నాయం సిద్ధతే అంటూ, AIను ఫోర్స్ మల్టిప్లయర్‌గా అభివర్ణించారు. స్టాన్‌ఫోర్డ్ గ్లోబల్ AI వైబ్రెన్సీ ఇండెక్స్ 2025లో భారత్ మూడో స్థానంలో నిలిచిందని, 2030 నాటికి IT రంగం 400 బిలియన్ల డాల‌ర్ల‌కు చేరుతుందని అంచనా వేశారు. డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు AI కంటెంట్ వాటర్‌మార్కింగ్ వంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, India AI Safety Institute ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుది నిర్ణయాధికారం ఎప్పుడూ మనుషులదే అని స్పష్టం చేస్తూ, నేరాలు, ఉగ్రవాదంలో AI వినియోగాన్ని కఠినంగా నిషేధించాల్సిన అవసరాన్ని చెప్పారు. భారత్ టెక్నాలజీని వినియోగించడమే కాదు, సృష్టించే దేశంగా మారాలన్న లక్ష్యాన్ని వెల్లడిస్తూ, ప్రపంచంలో టాప్ మూడు AI శక్తులలో ఒకటిగా ఎదగాలని ఆకాంక్షించారు. AI ప్రతి భారతీయుడికి అవకాశాల సాధనగా, సామర్థ్యాల పెంపుగా, మానవ గౌరవానికి సేవకుడిగా మారాలి, జీవనోపాధికి ముప్పుగా కాదు.. అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య‌లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment