
నటి శ్రియా శరన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు. 25 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం పూర్తి చేసి, మధ్య నలభైల్లో ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గడంలేదు. అర్థవంతమైన, మంచి పారితోషికం ఉన్న పాత్రలు వరుసగా అందుకుంటున్నారు. కూతురికి తల్లిగా ఉన్న శ్రియా ప్రస్తుతం తల్లి, భార్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు జోడీగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నర్తకిగా నటించాలి..
నటనతో పాటు శ్రియా శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందింది. ఆమె అందం, తెరపై కనిపించే నెమ్మది, నాజూకుతనం వెనుక నృత్య సాధనే కారణమని అభిమానులు భావిస్తారు. శ్రియాకు నృత్యమే మొదటి ప్రేమ. ఇంకా చేయని పాత్ర ఏదైనా ఉందా అని ప్రశ్నించగా, ఆమె స్పష్టంగా స్పందించారు. తెరపై ఒక నర్తకిగా కనిపించాలని తనకు ఎంతో కోరిక ఉందని చెప్పారు. ఒక నర్తకి జీవితం, ప్రయాణం ఆధారంగా రూపొందే కథలో నటించాలని ఆసక్తిని వ్యక్తం చేశారు.
పలు ప్రాజెక్టులతో బిజీ..
తన నటనా జీవితం గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేదని శ్రియా వెల్లడించారు. నటి కావడంపై అసంతృప్తి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తన వృత్తిపై అదే ఉత్సాహం, ఆసక్తి కొనసాగుతోందని ఆమె మాటల్లో తెలుస్తోంది. కాగా శ్రియా శరన్ ప్రస్తుతం పలు మూవీలు, సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఆమె దృశ్యం 3లో ప్రస్తుతం నటిస్తుండగా, ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. తెలుగులో ఆమె మిరాయ్ సినిమాలో నటించి అలరించారు. అలాగే తమిళంలో రెట్రో సినిమా చేశారు. ఇవి 2025లో రిలీజ్ అయి చక్కని విజయాన్ని అందించాయి. తమిళంలోనే మరో ప్రాజెక్టులోనూ ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక హిందీలో ఆమె ప్రస్తుతం స్పేస్ జెన్: చంద్రయాన్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.







