
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్ (The Raja Saab) మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా నిలవడంతో నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలో రిలీజ్ చేశారు. జియో హాట్ స్టార్‌లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన లేదా మంచి పేరు తెచ్చుకుని కూడా ప్రేక్షకులు లేని సినిమాలు చాలా వరకు ఓటీటీలో హిట్ అవుతుంటాయి. దీని వల్ల మేకర్స్‌కు కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుంది. కానీ రాజా సాబ్ మూవీ ఓటీటీలోనూ డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలను ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ ఎత్తున దర్శకుడితోపాటు ప్రభాస్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు.
ఓటీటీలోనూ నిరాశే..
థియేటర్లలో విడుదలైన ది రాజా సాబ్ సినిమాను ప్రేక్షకులు భారీ ఎత్తున రిజెక్ట్ చేశారు. విశ్లేషకులు సైతం ఈ మూవీని తీవ్రంగా విమర్శించారు. దీంతో నిర్మాతలకు భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి. అయితే ఓటీటీలోనూ ఈ మూవీకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను ప్రేక్షకులు, విశ్లేషకులు మరింత శూల శోధన చేస్తూ ప్రభాస్‌ను, దర్శకుడు మారుతిని భారీ ఎత్తున విమర్శిస్తున్నారు. అసలు ఈ సినిమా చేయాలని మీకు ఎలా అనిపించింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు మారుతిని అయితే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆయనకు సినిమాను ఎలా తీయాలో తెలియదని విమర్శిస్తున్నారు.
దర్శకుడు మారుతి ఫెయిల్..
ది రాజా సాబ్ సినిమాలో పలు సన్నివేశాలను ప్రేక్షకులు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏయే సన్నివేశాల్లో తప్పులు జరిగాయో వివరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కంటిన్యుటీ తప్పులు అనేకం చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. సాధారణంగా దర్శకుడు మారుతికి తక్కువ బడ్జెట్‌లోనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లను తీస్తాడని, ఆయన సినిమాల్లో కామెడీ ఉంటుందని ప్రేక్షకులు కితాబిస్తుంటారు. అయితే అలాంటి సాధారణ దర్శకుడికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే దాన్ని మారుతి సద్వినియోగం చేసుకోలేకపోయాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు కేవలం మారుతినే కాదు, ప్రభాస్‌ను సైతం వదలడం లేదు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా కృతకంగా ఉందని అంటున్నారు. పలు సన్నివేశాల్లో ఆయన అసలు అంటీ ముట్టనట్లు యాక్టింగ్ చేశాడని అంటున్నారు.
గ్రాఫిక్స్, డూప్స్ పై అసహనం..
ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్‌కు చాలా సన్నివేశాల్లో డూప్‌లను ఉపయోగించారు. అయితే కొన్ని సీన్లలో ఏకంగా ఆయన ముఖాన్ని ఫేస్ స్వాపింగ్ చేశారు. ఈ క్రమంలో గ్రాఫిక్స్ ను ఉపయోగించారు. కానీ ఆ గ్రాఫిక్స్ సరిగ్గా రాలేదు. దీంతో ఆయా సన్నివేశాల్లో ప్రభాస్ ను అసలు చూడాలనిపించలేదు..అని ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో ఈ విషయాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రభాస్ ముఖాన్ని ఫేస్ స్వాపింగ్ చేసే బదులు నేరుగా ఆయననే నటింపజేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఫేస్ స్వాపింగ్ కోసం వాడిన గ్రాఫిక్స్‌ను సినిమాకు వాడి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇలా ప్రభాస్ రాజాసాబ్ మూవీ థియేటర్ల కన్నా ఓటీటీలోనే ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుందని నెటిజన్ల కామెంట్లను చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో ప్రభాస్ తదుపరి సినిమా ఫౌజీపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమాతో ప్రభాస్ అభిమానుల ఆశలను నిజం చేస్తారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.








