
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, బ్లడ్ షుగర్ సమతుల్యత సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కునాల్ సూద్ కొన్ని సూపర్ ఫుడ్స్ ను సూచించారు. ఇవి గ్లూకోజ్ నియంత్రణకు సహకరిస్తాయని ఆయన తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో డాక్టర్ కునాల్ సూద్, కార్బొహైడ్రేట్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచే ఆరు ఆహార పదార్థాలను వివరించారు.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. భోజనం తర్వాత వచ్చే షుగర్ స్పైక్స్‌ను తగ్గించడమే కాకుండా, ఫాస్టింగ్ గ్లూకోజ్, హెచ్‌బిఎ1సి స్థాయిలను గణనీయంగా తగ్గించగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయన్నారు.
అవకాడో
తక్కువ కార్బొహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన అవకాడో మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, మెటబాలిక్ ప్రక్రియలను మెరుగుపరుస్తుందని చెప్పారు.
పప్పులు
పప్పుల్లో నెమ్మదిగా జీర్ణమయ్యే స్టార్చ్, రెసిస్టెంట్ స్టార్చ్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయని, కాలేయ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుందని డాక్టర్ తెలిపారు.
View this post on Instagram
ఆపిల్ సైడర్ వినిగర్
ఆపిల్ సైడర్ వినిగర్ కార్బొహైడ్రేట్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, పొట్ట నిండిన భావన కలిగిస్తుందని చెప్పారు. రోజూ తీసుకుంటే టైప్-2 మధుమేహ రోగుల్లో ఫాస్టింగ్ షుగర్, హెచ్‌బిఎ1సి స్థాయిలు మెరుగుపడినట్లు పరిశోధనలు చెబుతున్నాయన్నారు.
బెర్రీలు
యాంటీఆక్సిడెంట్లు, ద్రవ ఫైబర్‌తో నిండిన బెర్రీలు కార్బొహైడ్రేట్ శోషణను తగ్గిస్తాయి. భోజనం తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిల నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయని వివరించారు.
చియా విత్తనాలు
చియా విత్తనాలు నీటితో కలిసినప్పుడు జెల్‌లా మారి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీని వల్ల భోజనం తర్వాత షుగర్ ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుందని డాక్టర్ కునాల్ సూద్ తెలిపారు.
గమనిక: ఈ సమాచారం కేవలం వైద్య విజ్ఞానం, అవగాహన కోసం మాత్రమే. చికిత్స కోసం కాదు. ఎవరికైనా సరే ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించి సరైన సలహా, చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.








