
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆక్రమించింది. కొన్ని నెలల క్రితం వరకు రామ్ చరణ్, అడివి శేష్ తమ సినిమాలు పెద్ది, డెకాయిట్ లతో భారీ పోటీలో ఉన్నప్పటికీ మార్చిలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ వేసవిలో బాక్సాఫీస్ మంటలు రేపుతుంది. పవర్ స్టార్ – కల్ట్ కెప్టెన్ కాంబినేషన్‌తో ఉస్తాద్ గ్రాండ్ రిలీజ్ అంటూ వారు ప్రకటన చేశారు.
కొత్త తేదీలు ఇవే..
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే బుచ్చి బాబు సానా సోషల్ మీడియాలో 30-04-2026 న PEDDI వస్తుంది అంటూ పోస్టు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కూడా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ PEDDI ఏప్రిల్ 30, 2026న మీ ముందుకు వస్తుందని తెలిపారు. మొదట మార్చి 27కు నిర్ణయించిన విడుదలను అధికారికంగా ఏప్రిల్‌కు మార్చేశారు. ఇక అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ ను కూడా మార్చి 19 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. దీంతో మార్చి 26న నాని నటించిన ది ప్యారడైజ్ విడుదల యథావిధిగా జరుగుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలే కారణమా..?
ఇక మార్చి నెలలో ప్రధానంగా మిగిలింది ఒక్కటే భారీ పోరు. ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ తొలి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దానికి సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు యశ్ నటించిన టాక్సిక్ సినిమా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపైనా భారీ హైప్ ఉంది. ఇక మార్చి బాక్సాఫీస్ రంగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో మరింత హీట్ పెరిగింది. ఏప్రిల్‌లో మాత్రం టాలీవుడ్ స్టార్ సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉండడంతో రాబోయే నెలలు సినిమా ప్రేమికులకు పండగే అని అంటున్నారు.








