
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ అధికారికంగా బీసీబీకి తెలియజేసింది. దాదాపు మూడు వారాల పాటు జరిగిన చర్చలు, లేఖా వ్యహారాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. తాజాగా బీసీబీకి పంపిన ఈమెయిల్‌లో, బంగ్లాదేశ్ ప్రభుత్వమే భారత్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని బీసీబీ ఐసీసీకి తెలియజేసిన నేపథ్యంలో స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేశారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూప్ సి లో ఆడాల్సి ఉంది. కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉండగా, ఇప్పుడు అవే మ్యాచ్‌లను స్కాట్లాండ్ ఆడనుంది.
నిబంధనల ప్రకారం డీఆర్‌సీ పనిచేయదు..
ఈ పరిణామాల మధ్య, బీసీబీ ఐసీసీకి మరో లేఖ రాసి, ఈ అంశాన్ని ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ (డీఆర్‌సీ)కి తీసుకెళ్లాలని కోరినట్లు ESPNcricinfo వెల్లడించింది. అయితే, ఐసీసీ బోర్డు ఇప్పటికే మెజారిటీ ఓటింగ్ ద్వారా బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించినందున, డీఆర్‌సీకి వెళ్లే అవకాశం ఉందా లేదా అన్నది స్పష్టత లేని పరిస్థితి. ఎందుకంటే డీఆర్‌సీ నిబంధనల ప్రకారం, ఐసీసీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ బాడీగా ఆ కమిటీ పని చేయదని స్పష్టంగా ఉంది. ఇటీవలే ఐసీసీ బోర్డు అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు అంగీకరించకపోతే తప్పకుండా ప్రత్యామ్నాయ జట్టును తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీలంకకు మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ పట్టుబట్టడాన్ని కూడా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. టోర్నీ ప్రారంభానికి ఇంత దగ్గరగా షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదు. భారత్‌లో జట్లకు ఎలాంటి నమ్మదగిన భద్రతా ముప్పు లేదని మేం విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో షెడ్యూల్ మార్చితే భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నీల విశ్వసనీయతకు భంగం కలుగుతుంది, అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిర్ణయంపై వెనక్కి తగ్గని బీసీబీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం..
అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ రెండూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన సందర్భంలో ఐసీసీ తీసుకున్న వైఖరితో పోలిస్తే, ఇప్పుడు తమ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదానికి మూలం జనవరి 3న వెలుగులోకి వచ్చింది. ఆ రోజు బీసీసీఐ, ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. దీనికి స్పష్టమైన కారణం చెప్పకపోయినా, భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం. జనవరి 4న బంగ్లాదేశ్ ప్రభుత్వం సంప్రదింపుల అనంతరం, టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లేది లేదని బీసీబీ ఐసీసీకి అధికారికంగా తెలియజేసింది. ఆ తర్వాత జరిగిన చర్చలన్నింటిలోనూ అదే నిర్ణయంపై బీసీబీ నిలబడింది.
ఐపీఎల్ వ్యవహారాన్ని ప్రపంచకప్‌కు ముడిపెట్టడంపై ఐసీసీ అభ్యంతరం..
అయితే ఐసీసీ మాత్రం ముస్తాఫిజుర్ అంశాన్ని భద్రతా సమస్యగా పరిగణించడానికి నిరాకరించింది. ఒక ఆటగాడు డొమెస్టిక్ లీగ్(ఐపీఎల్)లో పాల్గొనడం వంటి వేరే అంశాన్ని టోర్నీ భద్రతతో ముడిపెట్టి బీసీబీ వ్యవహరిస్తోంది. ఇది పూర్తిగా సంబంధం లేని విషయం, అని ఐసీసీ స్పష్టం చేసింది. ఇలా, రాజకీయ, భద్రత కారణాలతో మొదలైన వివాదం చివరకు బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకోవడం, స్కాట్లాండ్‌కు అవకాశం దక్కడం వరకూ వచ్చింది. ఇది ప్రపంచ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. అయితే ఇప్పుడు బీసీబీ ఏం చేస్తుందనే విషయం ఉత్కంఠగా మారింది.








