ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు లేదా స్వార్థం కోసం పావులు కదుపుతారు. ఆ దిశగా బాధితులను పురిగొల్పుతారు. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్లు బాధితులను రెచ్చగొడతారు. చివరకు బాధితులు మరింత కష్టాల్లోకి కూరుకుపోయాక.. ఆ సో కాల్డ్ వ్యక్తులకు ఇక తమకు ఎలాంటి ప్రయోజనం కలగదని, ఏ లాభం చేకూరదని అర్థమైనప్పుడు.. అబ్బే.. మాకేం సంబంధం లేదు.. అన్నట్లు వ్యవహరిస్తారు. పూర్తిగా పక్కకు తప్పుకుంటారు. దీంతో దిగ్భ్రాంతికి గురవడం, చేష్టలుడిగి చూడడం బాధితుల వంతవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ కూడా సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ (బంగ్లాదేశ్ ప్లేయర్) ముస్తాఫిజుర్ రహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత సైకియా చెప్పడం, వెంటనే ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం పాటించడం చకచకా జరిగిపోయాయి. అసలు వివాదం అంతా ఇక్కడే మొదలైంది. కారణం చెప్పకుండా బీసీసీఐ ఆ పని చేసినందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కి కోపం రావడం సహజం. కానీ దానిపై ఆ బోర్డు బీసీసీఐకి లేఖ రాసి వివరణ కోరితే.. అప్పుడు బీసీసీఐ అసలు కారణం చెప్పి ఉంటే సమస్య ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఈ విషయంలో బీసీసీఐ పొరపాటు చేసిందని భావించినా బీసీబీ వివరణ అడిగి ఉంటే వివాదం అక్కడితోనే ముగిసేది. కానీ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంశం దారి మళ్లింది. అసలు కారణం చెప్పే విషయంలో బీసీసీఐ లేదా వివరణ అడిగే అంశంపై బీసీబీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదు.. అనేది అర్థం కాని విషయం.
కొన్ని కారణాల వల్ల బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తొలగించింది కనుక, ఆ కారణాలు చెప్పకపోవడంతో బీసీబీ తమకు తాము భద్రత అనే కారణాన్ని ఊహించుకుని ఆ అంశంపైనే మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడ కూడా బీసీబీ పొరపాటే చేసిందని చెప్పవచ్చు. ముస్తాఫిజుర్‌ను ఎందుకు తీసేశారో చెప్పనప్పుడు ఫలానా కారణం అని అధికారికంగా చెప్పే వరకు అసలు స్పందించకుండా ఉండాల్సింది. కానీ భద్రత అనే కారణాన్ని ఎంచుకుని, ఐపీఎల్‌లో ఒక ప్లేయర్‌కే భద్రత కల్పించకపోతే వరల్డ్ కప్ లో మొత్తం టీమ్‌కు ఎలా రక్షణ కల్పిస్తారు.. అనే వాదనతో ఈ వివాదాన్ని వరల్డ్ కప్‌కు ముడిపెట్టింది. ఇక్కడే కథ ఇంకో మలుపు తిరిగింది. దీని వల్లే బంగ్లాదేశ్ ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
వాస్తవానికి ఐపీఎల్ అనేది భారత్‌కు చెందిన సొంత దేశవాళీ ప్రీమియం లీగ్ టోర్నీ. అందులో విదేశీ ప్లేయర్లు కూడా ఆడతారు. ఐసీసీకి అసలు ప్రమేయం ఉండదు. అంపైర్లు, ఇతర సర్వీసులను ఉపయోగించుకున్నందుకు ఐసీసీకి బీసీసీఐ ఫీజు చెల్లిస్తుంది. అంతవరకే. కానీ అసలు వివాదం ఐపీఎల్ అయితే దాన్ని వరల్డ్ కప్‌కు జోడించడం, ఐపీఎల్ తో సంబంధం లేని ఐసీసీకి ఆ లీగ్ పై బీసీబీ ఫిర్యాదు చేయడం, దాన్ని సాకుగా చూపి వరల్డ్ కప్ ను భారత్‌లో ఆడలేమని చెప్పడం.. ఇవన్నీ చాలా నాటకీయంగా జరిగాయి. ఐపీఎల్‌కు, ఐసీసీకి సంబంధం లేదు.. అనే విషయం తెలిసికూడా బీసీబీ పదే పదే అదే అంశంపై వాదనకు దిగడం క్రికెట్ నిపుణులు, మాజీలు, విశ్లేషకులనుసైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు బీసీబీ లేవనెత్తిన అంశాలను కూడా ఐసీసీ కఠినంగా కొట్టి పారేయలేదు. కావల్సినంత సమయం ఇచ్చింది. పలు మార్లు చర్చించింది. భారత్‌లో భద్రతపై తాము మూడో సంస్థతో సెక్యూరిటీ వివరాలపై పర్యవేక్షణ చేశామని, బంగ్లా క్రికెటర్లకు నేరుగా వచ్చే ముప్పు ఏమీ లేదని కూడా స్పష్టం చేసింది. అందువల్ల భద్రత అన్న కారణంపై బీసీబీ చేస్తున్న వాదనకు అర్థం లేదని తేలిపోయింది.
ఐసీసీతో బీసీబీ చర్చలు జరుగుతున్న సందర్భంలోనే అనూహ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఈ వ్యవహారంలో తలదూర్చింది. ఆ దేశ మాజీ ప్లేయర్లు రషీద్ లతీఫ్ లాంటి వారు కొందరు బహిరంగంగానే ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు సపోర్ట్ ఇచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది. పైన మొదట్లో నేను చెప్పిన సామెతలాగా ఇక్కడ బంగ్లాదేశ్ బాధిత పక్షంగా మారగా, వారిని ఎగదోసిన పక్షంగా పాకిస్థాన్ మారింది. ఈ విషయంలో బంగ్లాను రెచ్చగొట్టి భారత్‌పై ఒత్తిడి తేవాలని, భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలని, మొత్తంగా టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు ఆటంకాలు సృష్టించడం ద్వారా క్రికెట్ ప్రపంచంలో భారత్ పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రపంచానికి చెప్పాలనే కుట్రపూరిత దుర్భుద్ధితో పీసీబీ వ్యవహరించింది. ఓ దశలో బంగ్లాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని, బంగ్లా అభ్యర్థనను ఐసీసీ అనుమతించకపోతే తాము కూడా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని పరోక్షంగా మీడియా ద్వారా లీకులు ఇస్తూ హెచ్చరించింది. పీసీబీ ఈ విషయంపై బీసీబీకి లేఖలు కూడా రాసింది. అలాగే ఐసీసీ సమావేశంలోనూ బంగ్లాకు మద్దతుగా ఉన్నట్లు నటించిన పాకిస్థాన్ ఆ దేశానికి అనుకూలంగా ఓటు కూడా వేసింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గుడ్డిగా నమ్మింది. ఇక్కడే బీసీబీ బోల్తా పడింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఐసీసీ తమ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. ఎక్కడా ఏ దేశాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేయలేదు. ఏ నిర్ణయం విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించలేదు. బంగ్లాదేశ్ కోరినట్లు వారి మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించడంపై కూడా ఐసీసీ సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టింది. అందులో సభ్య దేశాల ఓటింగ్ మేరకే నిర్ణయం తీసుకుంది. మెజారిటీ సభ్యుల ఓటింగ్ మేరకు బంగ్లా మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించబోమని చెప్పడమే కాకుండా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన గడువు కన్నా మరో రోజును అదనంగా పొడిగిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్‌తో ముందు నుంచి ఉన్న ఒప్పందం కారణంగా వారి మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తే వస్తున్నారు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. టోర్నీ షెడ్యూల్, ప్లేయర్ల ప్రయాణం, వసతి వంటి అన్ని విషయాలు నిర్దారణ అయ్యాక ఏ టోర్నీ నిర్వాహకులు అయినా చేసేదేమీ ఉండదు. టీమ్‌లు వస్తే మ్యాచ్‌లను నిర్వహిస్తారు. లేకపోతే నిబంధనల మేరకు వ్యవహరిస్తారు. ఇక్కడ ఐసీసీ కూడా చేసిందదే. బహుశా షెడ్యూల్ రాక ముందే బీసీబీ కోరి ఉంటే అప్పుడు పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదని అందరికీ అర్థమవుతుంది. కానీ భారత్-బంగ్లా ఉద్రిక్తతలు ఈ మధ్యే మొదలయ్యాయి. అప్పటికే వరల్డ్ కప్ టోర్నీ షెడ్యూల్ మొత్తం వచ్చేసింది. కనుక ఐసీసీ కూడా ఈ విషయంలో నిబంధనల మేరకే వ్యవహరించింది.
అయితే పాక్ తమను రెచ్చగొడుతుందని, అసలు సమస్య లేదని, తాము తప్పుకోవడం తమ ప్లేయర్లకే నష్టం అన్న అసలు విషయాన్ని గ్రహించకుండా బీసీబీ చివరకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తొలగించేదేమిటి.. మేమే ఈ టోర్నీని బహిష్కరిస్తున్నామని ప్రకటన చేసింది. దీంతో వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక ఇప్పుడు బంతి ఐసీసీ కోర్టులో ఉంది. బంగ్లాకు ఇప్పటికే ఇవ్వాల్సిన అవకాశాలు, గడువులను ఇచ్చింది కనుక ఐసీసీ నుంచి ఇక, బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్‌లో ఆడడం లేదు, స్కాట్లండ్‌ను తీసుకుంటున్నాం.. అనే ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ నిష్క్రమణపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా తుది నిర్ణయం మాత్రం అదేనని అర్థమవుతోంది. ఇక ఈ మొత్తం వ్యవహారం అనంతరం పాక్ వైఖరి పట్ల బంగ్లాదేశ్ కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందని తెలుస్తోంది. మరి బీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బంగ్లా క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.
ముగింపు: ఈ కథనంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…