పాపం.. ఆప‌రేష‌న్ కోస‌మ‌ని దాచుకుంటే రూ.2 ల‌క్ష‌ల విలువైన నోట్ల‌ను ఎలుక‌లు కొరికేశాయి..!

July 18, 2021 1:14 PM

విధి అత‌నితో వింత నాట‌కం ఆడింది. పైసా పైసా కూడ‌బెట్టి ఆప‌రేష‌న్ కోస‌మ‌ని రూ.ల‌క్ష‌లు దాచుకుంటే వాటిని ఎలుక‌లు కొరికేశాయి. దీంతో ఆ వ్య‌క్తి ప‌డుతున్న వేద‌న అంతా ఇంతా కాదు. ఈ సంఘ‌ట‌న మహబూబాబాద్‌ మండలం ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

rats eat currency in mahaboobabad mandal

మహబూబాబాద్‌ మండలం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవ‌నం సాగిస్తున్నాడు. తన పొట్ట‌లో ఏర్పడిన కణితిని ఆపరేషన్‌ చేసి తొలగించుకునేందుకు కష్ట‌ప‌డి పైసా పైసా కూడ‌బెట్టి, కొంద‌రి వ‌ద్ద అప్పులు చేసి రూ.2 లక్షలు పోగు చేశాడు. ఆప‌రేష‌న్‌కు ఆ మొత్తం అవ‌స‌రం అవుతుంద‌ని చెప్ప‌డంతో దాన్ని ఎట్ట‌కేల‌కు పూర్తి చేశాడు. అయితే అత‌ని దుర‌దృష్ట‌మో, మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది.

అత‌ను కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును, దానికి తోడు మిగిలిన న‌గ‌దును మొత్తం క‌లిపి రూ.2 ల‌క్ష‌ల‌ను ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. రూ.500 నోట్ల‌ను ఎలుక‌లు కొరికి పాడు చేశాయి. దీంతో వాటిని చూసి అత‌ను ల‌బోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మ‌రి అత‌ని గోడును ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా, లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment