
నిఖిల్ సిద్ధార్థ తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటికంటే అతిపెద్దది, అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్న ప్రాజెక్ట్ స్వయంభుతో ముందుకొస్తున్నారు. భారత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగోర్ మధు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజువల్ స్పెక్టకల్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. తాజాగా టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్లకు ఘనంగా శ్రీకారం చుట్టారు. టీజర్ ఆరంభం శెంగోల్ మహిమతో మొదలవుతుంది. భగవాన్ శివుడు శ్రీరామునికి అందించిన పవిత్ర దండంగా భావించే శెంగోల్ చుట్టూ కథ అల్లుకుంది. ఆ దివ్య చిహ్నానికే వనవాసం ఎదురై, దాన్ని తిరిగి సాధించేందుకు రక్తపాత యుద్ధాలు జరిగాయని కథనం సూచిస్తోంది.
క్రీ.శ.985 కాలం నేపథ్యంలో..
క్రీ.శ. 985 కాలాన్ని నేపథ్యంగా తీసుకుని, భారత చరిత్రను పురాణాలతో మేళవించిన కథగా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో నిఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. పొడవాటి యోధుడి జుట్టు, వంకర మీసం, గడ్డం, కండలతో తీర్చిదిద్దిన శరీరాకృతితో యుద్ధ వీరుడిగా ఆయన పూర్తిగా మారిపోయారు. సంయుక్త, నభా నటేష్ సంప్రదాయ పాత్రలకు భిన్నంగా, శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకోనున్నారు.
వేసవిలో విడుదల..
ఛాయాగ్రాహకుడు కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్‌కు అద్భుతమైన డెప్త్‌ను అందించారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత ఉత్కంఠను అందించింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ పీసీఎక్స్ థియేటర్‌లో టీజర్‌ను 3డీలో ప్రదర్శించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా స్వయంభు ద్వారా నిఖిల్ గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.








