
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని అహ్మదాబాద్‌లో ఉన్న స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) 2026 సంవత్సరానికి గాను సైంటిస్ట్/ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-ఎ కేటగిరీలోకి వచ్చే సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ, సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2026 ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఫిబ్రవరి 12, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హతలు, వయోపరిమితి లెక్కింపు కూడా ఇదే తేదీ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే..
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ విభాగంలో ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్‌కు 2 పోస్టులు, వైర్లెస్/శాటిలైట్/డిజిటల్ కమ్యూనికేషన్‌కు 1 పోస్టు, అగ్రికల్చరల్ ఫిజిక్స్ లేదా మీటీరియాలజీకి 1 పోస్టును కేటాయించారు. అలాగే సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌కు 3, వీఎల్ఎస్ఐ/మైక్రోఎలక్ట్రానిక్స్కు 10, వైర్లెస్/శాటిలైట్ కమ్యూనికేషన్‌కు 1, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు 7, నెసాక్ కోసం కంప్యూటర్ సైన్స్‌కు 1, పవర్ ఎలక్ట్రానిక్స్‌కు 4, అప్లైడ్ ఆప్టిక్స్కు 1, సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లేదా హైడ్రాలజీకి 1, అగ్రికల్చర్‌కు 6, స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌కు 1, ఫిజికల్ ఓషనోగ్రఫీకి 1, మెరైన్ బయాలజీ/మెరైన్ సైన్స్‌కు 1, అట్మాస్ఫెరిక్ సైన్స్ అండ్ ఓషనోగ్రఫీకి 8 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు..
- విద్యార్హతల విషయానికి వస్తే, సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ పోస్టులకు అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
- కనీసం 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏ అవసరం. బీఈ/బీటెక్ డిగ్రీతో 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కొన్ని ప్రత్యేక పోస్టుల కోసం సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉన్నవారికీ అర్హత కల్పించారు.
- ఇక సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ పోస్టులకు సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత పీజీ డిగ్రీ అవసరం.
- అన్ని డిగ్రీలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచే ఉండాలి.
వయో పరిమితి..
వయోపరిమితి ఫిబ్రవరి 12, 2026 నాటికి లెక్కించబడుతుంది. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ పోస్టులలో ఎంఈ/ఎంటెక్ అర్హత ఉన్నవారికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు కాగా, ఎంఎస్సీ అర్హత ఉన్నవారికి 28 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం పోస్టును బట్టి భిన్నంగా ఉంటుంది. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ పోస్టులకు మొదట స్క్రీనింగ్ చేసి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
వేతనం..
జీతభత్యాల పరంగా కూడా ఈ ఉద్యోగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్డీ పోస్టులకు పే లెవల్-11 ప్రకారం నెలకు రూ.67,100 నుంచి రూ.2,08,700 వరకు వేతనం ఉంటుంది. సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ పోస్టులకు పే లెవల్-10 కింద నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం అందిస్తారు. వీటితో పాటు డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్సులు కూడా ఇస్రో నిబంధనల ప్రకారం లభిస్తాయి.
అప్లికేషన్ లింక్..
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి.
- స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అధికారిక వెబ్సైట్లు sac.gov.in లేదా careers.sac.gov.in ద్వారా ఫారం నింపాలి.
- దరఖాస్తు చేసే ముందు ఇస్రో లైవ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదు కావడం తప్పనిసరి.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ సేవ చేయాలనుకునే వారికి ఈ నియామక ప్రక్రియ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని నిపుణులు పేర్కొంటున్నారు.








