
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు త్వరగా ఔట్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే అవసరం వచ్చినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో భారత్ టీ20 వరల్డ్ కప్‌కు ముందు అద్భుతమైన ఫామ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్ బౌలర్లు తొలి 2 ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లను తీసినా ఆ తరువాత ఆ ఆరంభాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. పరుగులను అధికంగా సమర్పించుకున్నారు. దీంతో భారత్ అధిక రన్ రేట్‌తో పోరాడింది. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కివీస్ భారీ స్కోరు..
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో కెప్టెన్ మిచెల్ శాంటనర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో ప్లేయర్ రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. అలాగే మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా వచ్చిన వారు వచ్చినట్లే బౌండరీలను బాదుతూ స్కోరు బోర్డును ఉరకెత్తించారు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివం దూబె తలా 1 వికెట్ తీశారు.
ఆదుకున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్..
అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ తొలి ఓవర్‌లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో అవుట్ అయి వెనుదిరిగాడు. మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం పరుగులు లేమీ చేయకుండానే డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. అయితే తరువాత వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడారు. ఓ వైపు బౌండరీలను బాదుతూనే మధ్య మధ్యలో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి భారత్ విజయానికి బాటలు వేశాడు. ఇక ఆ తరువాత వచ్చిన శివం దూబె 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా ఇషాన్ కిషన్ అనంతరం మరో వికెట్ పడకుండా సూర్యకుమార్‌కు చక్కని సహకారం అందించి మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో నిలిచాడు. ఈ క్రమంలో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసింది. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫ్ఫీ, ఇష్ సోధిలకు తలా 1 వికెట్ దక్కింది.
సిరీస్‌లో 2-0 ఆధిక్యం..
రాయ్‌పూర్‌లో జరిగిన 2వ టీ20లో భారత్ విజయం సాధించడంతో 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యానికి చేరింది. తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 238 పరుగుల భారీ స్కోరు చేసి అనంతరం దాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తద్వారా తమ ఛేజింగ్ బలాన్ని టెస్ట్ చేద్దామని భావిస్తున్నామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో తెలిపాడు. అయితే న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచడంతో భారత్ ఆ స్కోరును సాధిస్తుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తొలి 2 ఓవర్లలో వరుసగా వికెట్లను కూడా కోల్పోయింది. అయితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మరో వికెట్ పడకుండా విజయాన్ని దాదాపుగా ఖరారు చేశారు. ఆ తరువాత కిషన్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన దూబె చివరి వరకు సూర్యతో నిలిచి మ్యాచ్‌ను ముగించారు.








