
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా అందిస్తాయి. అయితే, పప్పుల నుంచి పూర్తి పోషక ప్రయోజనాలు పొందాలంటే ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పోషకాహార నిపుణురాలు దీప్సికా జైన్ సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో ఆమె, పప్పులను వండే ముందు తప్పకుండా నానబెట్టాలని (soaking) చెప్పారు. ఇలా నానబెట్టడం వల్ల పప్పుల్లో ఉండే యాంటీ న్యూట్రియెంట్స్ తగ్గి, జీర్ణక్రియ మెరుగవుతుందని ఆమె వివరించారు.
విడగొట్టిన పప్పులను తినాలి..
దీప్సికా జైన్ మాటల్లో, పప్పులు గుండె ఆరోగ్యం, పేగుల ఆరోగ్యం (గట్ హెల్త్), రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. కానీ నానబెట్టకుండా వండితే ఈ ప్రయోజనాలు పూర్తిగా అందవని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా పొత్తికడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండేవారు మొత్తం పప్పుల కంటే విడగొట్టిన పప్పులు (split dals) తినడం మంచిదని చెప్పారు. వీటిలో తొక్క తొలగిపోవడం వల్ల సంక్లిష్ట చక్కెరలు, యాంటీ న్యూట్రియెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, పొట్టలో తేలికగా జీర్ణమవుతాయి.
శనగలను తింటే గుండెకు మంచిది..
గుండె ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారికి శనగలు (చిక్ పీస్) మంచివని ఆమె సూచించారు. వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె పనితీరు మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణకూ సహాయపడతాయని తెలిపారు. అలాగే PCOS సమస్య ఉన్న మహిళలకు మొత్తం పెసరపప్పు (whole moong dal) ఉత్తమమని, ఇది తేలికగా జీర్ణమై శరీరంలో వాపు (inflammation) తగ్గించడంలో, హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుందని చెప్పారు. డయాబెటిస్ ఉన్నవారికి మసూర్ దాల్ (ఎర్ర పప్పు) మంచిదని, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ మెరుగవుతుందని వివరించారు.
మొత్తానికి, సరైన రకం పప్పును ఎంపిక చేయడం మాత్రమే కాకుండా, వండే ముందు నానబెట్టడం కూడా ఎంతో కీలకమని ఆమె చెబుతున్నారు. ఇలా చేస్తే పప్పుల నుంచి గరిష్ట పోషక విలువలు లభిస్తాయి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
గమనిక: ఇవన్నీ సాధారణ సమాచారం కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.
View this post on Instagram








