Nellore Chepala Pulusu : నెల్లూరు ఫేమస్‌ చేపల పులుసు తెలుసా.. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి..!

August 29, 2022 10:18 PM

Nellore Chepala Pulusu : మన తెలుగువారంటేనే భోజనప్రియులు అని వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు అంటే తెగ పడి చచ్చిపోతారు. ఆంధ్ర వంటకాల‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మన వంటకాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా చేపల పులుసు పెట్టడంలో మన వాళ్లకు సాటి మరెవరూ ఉండరు. చేపల పులుసు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మన నెల్లూరోళ్ల చేప‌ల పులుసు. చేపల పులుసు పెట్టాలి అంటే మన నెల్లూరోళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. వాళ్ళు వండే చేపల పులుసు ఘుమ ఘుమలతో వీధి మొత్తం నోట్లో నీళ్లు ఊరడం ఖాయం.

నెల్లూరు జిల్లా వాసుల‌కు చేప‌ల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంది. కొర్రమీను దగ్గర నుంచి సొర‌చేప‌, పండుగ‌ప్ప, బొమ్మిడాయి గండి, బొచ్చ, చంద‌మామ‌, నెత్తాళ్ళు ఇలా ఎన్నో ర‌కాల చేప‌లు నెల్లూరులో దొరుకుతాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే నెల్లూరులో దొరికే బొమ్మిడాయిల పులుసు కోసం ఎగబడతారు. నెల్లూరులో పెట్టే చేపల పులుసు విధానం మనం కూడా తెలుసుకోవాలి కదా. నెల్లూరోళ్ల మాదిరిగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Nellore Chepala Pulusu have you ever tried it before
Nellore Chepala Pulusu

ముందుగా బొమ్మిడాయిలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత గిన్నెలో గ‌ళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసి జిగురు పోయేవరకూ రుద్దకోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సిలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని అవ‌స‌ర‌మైన మేర‌కు నూనె వేసుకోవాలి.

నూనె వేడెక్కిన తర్వాత మిర్చి, ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ఆ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ త‌ర్వాత‌ బొమ్మిడాయిల చేపలను అందులో వేసుకుని బాగా వేయించాలి. అలాగే చింతపండు గుజ్జులో నీరు పోసుకుని క‌లిపి దానిని పులుసులో పోయాలి. కరివేపాకు, కొత్తమీర వేసుకుని పులుసు దగ్గరపడే వరకూ మరిగించాలి. కాసేప‌టికి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ. రాగిసంకటిలో బొమ్మిడాయిల పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇలా ఎవ‌రైనా సరే నెల్లూరు చేప‌ల పులుసు పెట్ట‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now