Telangana : మేడారం జాత‌ర‌కు 3,845 ప్ర‌త్యేక బ‌స్సులు.. 50 ఎక‌రాల్లో ప్ర‌త్యేక బ‌స్‌స్టేష‌న్‌..

February 4, 2022 8:28 PM

Telangana : ఆసియాలోనే అతి పెద్ద జాత‌ర అయిన మేడారం జాత‌ర‌కు స‌ర్వం సిద్ధం అయింది. ఇప్ప‌టికే అధికారులు ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. జాత‌ర ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19 తేదీల్లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మేడారంకు వ‌చ్చే భ‌క్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మేడారంలో స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ.300 కోట్ల‌ను విడుద‌ల చేసింది. కాగా మేడారం జాత‌ర‌కు మొత్తం 3,845 బస్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Telangana RTC to run 3845 special buses for medaram jathara
Telangana

మేడారం జాత‌ర‌కు దాదాపుగా 23 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఆర్‌టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే అవ‌కాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51 పాయింట్ల నుంచి మేడారంకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపిస్తున్న‌ట్లు తెలిపారు. మేడారంలో 50 ఎక‌రాల స్థలంలో తాత్కాలికంగా ప్ర‌త్యేక బ‌స్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. అందులో భ‌క్తుల‌కు అన్ని స‌దుపాయాలు అందుబాటులో ఉంచామ‌న్నారు. బ‌స్సుల కోసం వేచి ఉండే స‌దుపాయంతోపాటు ఆహార‌శాల‌ల‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆ బ‌స్‌స్టేష‌న్‌లోనే ఓ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ఉంటుంద‌ని అన్నారు.

మేడారం బ‌స్ స్టేష‌న్‌లో 300 మంది వాలంటీర్లు ప్ర‌యాణికుల‌కు సేవ‌ల‌ను అందిస్తార‌ని తెలిపారు. 42 క్యూ లైన్లు ఉంటాయ‌న్నారు. ప్ర‌యాణికుల‌కు వాలంటీర్లు అందుబాటులో ఉంటార‌ని, వారికి ఎటువంటి స‌హాయం కావాల‌న్నా సేవ‌ల‌ను అందిస్తార‌ని తెలిపారు.

ఇక ప్ర‌యాణికులు 040-30102829 అనే నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయ‌డం ద్వారా డోర్ పిక‌ప్ స‌ర్వీస్‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు. 30 మంది అంత‌క‌న్నా ఎక్కువ మంది ప్రయాణికులు ఒకే చోట నుంచి ప్ర‌యాణించ ద‌లిస్తే ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపిస్తామ‌న్నారు. రాష్ట్రంలో 523 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప్ర‌స్తుతం న‌డిపిస్తున్నామ‌ని.. త్వ‌ర‌లో వాటి సంఖ్య పెరుగుతుంద‌ని తెలిపారు. ఈ బ‌స్సుల ద్వారా రోజుకు 1250 ట్రిప్‌లు వేస్తున్నార‌ని అన్నారు. 1.20 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నార‌ని తెలిపారు.

మేడారం జాత‌ర‌కు ప‌నిచేసే ఆర్టీసీ సిబ్బంది అంద‌రికీ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించామ‌ని, బూస్ట‌ర్ డోస్ కూడా తీసుకున్నార‌ని.. స‌జ్జ‌నార్ తెలిపారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు మేడారం విత్ ది టీఎస్ఆర్‌టీసీ పేరిట ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని, ఇందులో భ‌క్తుల‌కు కావ‌ల్సిన స‌మాచారం మొత్తం ఉంటుంద‌ని తెలిపారు. మేడారంకు వ‌చ్చే మార్గాలు, అక్క‌డ అందుబాటులో ఉండే స‌దుపాయాలు, ఇత‌ర స‌మాచారం ఈ యాప్‌లో ఉంటుంద‌న్నారు. దీన్ని టీఎస్ఆర్‌టీసీ అధికారిక వెబ్ సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. ఇక ప్ర‌జ‌లు ఆర్‌టీసీ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవాల‌ని.. ప్రైవేటు వాహ‌నాల్లో ప్ర‌యాణం శ్రేయ‌స్క‌రం కాద‌ని.. స‌జ్జ‌నార్ సూచించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now